Friday, December 6, 2013

'ఆధార్' మీద రాళ్ళేయడం అవివేకం

బ్యాంకు ఖాతాలతో ఆధార్ నెంబర్ ని అనుసంధానించి, గ్యాస్ సబ్సిడీని నగదు రూపంలో జమ చేయాలన్నది ప్రభుత్వ ఆలోచన. దాని కొరకు సామాన్యులు తిప్పలు పడుతున్నారు కాబట్టి ఆధార్ అనుసంధానం అవసరం లేదని కొందరి వాదన. కోర్టులకెక్కడం. రేషన్ కార్డు, పాన్ కార్డు, ఓటరు కార్డులుండగా ఇంకో ఆధార్ కార్డు ఎందుకని వాదన. ఆధార్  వ్యక్తిగత  గోప్యతని మంటగలుపుతుందని ఇంకొంతమంది నేర్చినవారి  వాదన.  కానీ అందరమూ తెలుసుకోవాల్సిన విషయమేమిటంటే ఇంత పెద్ద జనాభా కలిగిన దేశానికి అది అవసరమే. దాన్ని ప్రవేశ పెట్టిన ఉద్దేశ్యం అర్దం కాకనే ఈ రాద్దాంతాలు.

కంప్యూటర్లతో సమాచారాన్ని ప్రాసెస్ చేయడానికి, వివిధ లావాదేవీలను అనుసంధానం చేయడానికి, వ్యక్తుల ఆదాయాలను మధింపు చేసి పన్ను ఎగవేత, ఆర్ధిక నేరాలను పసిగట్టడానికి, నేరస్వభావం గల వ్యక్తుల కదలికలను పసిగట్టడానికి విశిష్ట గుర్తింపు సంఖ్య బాగా పనికి వస్తుంది. సమాచార సాంకేతిక పరిజ్జానాన్ని ఉపయోగించడం అంటే  ప్రభుత్వ పనికి ఒక కొత్త సునిశిత శక్తిని సమకూర్చుకోవడమే. ప్రభుత్వాల నుండి సమర్ధవంతమైన సేవలను డిమాండ్ చేస్తూ వాటి సామర్ధ్యాన్ని పెంచే పరికరాన్ని నిరాకరించడం వివేకం ఎలా అవుతుంది ?

రేషన్ కార్డు పౌర సరఫరాలకి, పాన్ కార్డు ఆర్ధిక లావాదేవీలకు, ఓటరు కార్డు ఓటు వేయడానికి గుర్తింపు, డ్రైవింగ్ లైసెన్స్ రవాణా శాఖకు ఇలా ప్రతిదీ దేనికదే ఆ శాఖ కార్యక్రమాల పరిధికే పరిమితమై ఉన్నాయి. కానీ మనిషి ఒక్కడే.  వీటన్నిటినీ అనుసాంధానించి వ్యవహారాలను నిర్వహించడానికి,  మధింపు చేయడానికి ఉద్దేశించిందే ఆధార్ నెంబరు.  అది సమాచార వ్యవస్థకు వెన్నెముక లాంటిది.

ఇక గోప్యత విషయానికికొస్తే , అసలు గోచీ గుడ్డలకే తడుముకొంటున్న వాళ్ళున్న దేశంలో  గోప్యత గురించి మాట్లాడడం అర్ధరహితం. సంపదను అక్రమంగా గోప్యంగా దాచుకోవడానికే  ఈ వాదన పనికి వస్తుంది.  దోచుకొనే వాడికి కూడా గోప్యత కావాలి. చిన్నల్లు మెయింటెయిన్ చేసే వాడికి కావాలి గోప్యత.  నెట్టింట్లో  ఉన్న వాళ్ళందరూ గోప్యత లేని వాళ్ళ కిందే లెక్క. ఇక కొత్తగా గోప్యతకు వచ్చే ముప్పేముంది?

వేలిముద్రలు సేకరించడం మీద కూడా ఆక్షేపణ ఉంది. కానీ తీవ్రవాదుల దాడులు జరిగినప్పుడు భద్రతా వైఫల్యమని విమర్శించేదీ మనమే. ప్రభుత్వాలు తమ సామర్ధ్యాలని పెంచుకోవడానికి , సమర్ధ సేవలు అందించడానికి ఆధార్ లాంటి పరికరము అవసరమే. కంప్యూటర్ల యుగంలో బూజుపట్టిన ఆలోచనలు పనికి రావు.

Friday, August 9, 2013

తెలుగు వాళ్ళకు రెండో రాజధాని ఇస్తామంటుంటే, దేశానికి రెండో రాజధాని అంటారేమిటి ?

ఇదెక్కడి గొడవండీ బాబూ.తెలుగు వాళ్ళకుఇంకో రాజధానిని ఇస్తామని పెద్దోళ్ళు అంటే సంతోషించాలి గానీ హైదారాబాద్ ని దేశానికి  రెండో రాజధానిని చేయాలని మాట్లాడతారేమిటి? మనకు ఇంకో ఇల్లు కట్టుకొనే అవకాశం వచ్చిందని సంతోషిస్తాం. దాన్ని ఎలా కట్టుకోవాలో ప్లాన్లు వేస్తాం. కలలు కంటాం. ఇదేంది.  యేం పాడైందని హైదారాబాద్ లో. అందరం యెగబడి ఖరాబు చేయడం కాకపోతే. రెండు మూడొందల కిలోమీటర్ల అనవసర ప్రయాణం తప్పితే.  కోట్ల రూపాయల ఫ్లాటు ఉండి యేం లాభం చుక్క నీరు దొరక్కుంటే. పేద్ద కారుంటే యేం లాభం దానికి తగ్గ రోడ్లే లేకుంటే. దాన్ని ఆపడానికి జాగానే లేకుంటే.  నిమిషానికి గజం వేగంతో కారులోనే పోవాలా.  యెవడు గుద్దుతాడో,  యెవనికి మనం గుద్దుతామో. టెన్షన్ తో నడపడమే కదా?  డబ్బులు గణించుకోవడమే కానీ జీవన నాణ్యత అవసరం లేదా?

కొత్త రాజధానిలో నైనా స్థలాలు, వ్యాపారాలు దొరుకుతాయి కదా. ఎక్కడ సెక్రటేరియట్ ఉండాలి. ఎక్కడ నివాసాలు ఉండాలి. పార్కులెక్కడ ఉండాలి. ఇవి ఆలోచించాలి. అన్ని రంగాలను ఇప్పటికైనా ఒకే చోట కుప్ప పోయకూడదనే తెలివిడి తెచ్చుకోవాలి. కొత్త రాష్ట్రానికి ఒకటి కాకపోతే రెండు రాజధానులు ఉండాలి. పరిపాలన వసతులు మాత్రమే అక్కడ నిర్మించుకోవాలి. విద్యా రంగం వేరే ఊళ్ళో , పారిశ్రామిక రంగం ఇంకొకచోట, ఐ.టి. పార్కులు ఒక టౌనులో ఇలా వికేంద్రీకరణ తప్పకా జరగాలి. లేకుంటే ఈ ఇరుకులు మురికి తప్పవు.

అసలు తెలుగువాళ్ళకు ఇదేం వెర్రి? అప్పుడేమో పోయి పోయి మద్రాసులో పడ్డారు. అసలు సినిమా రంగంలోని మెజారిటీ జనమంతా కృష్ణా, గోదావరి జిల్లాల వాళ్ళే కదా. యే రాజమండ్రిలోనో స్టూడియోలు నిర్మించుకోవచ్చు కదా? కళల కాణాచి పేరు సార్ధకమయ్యేది కదా? ఇప్పుడేమో హైదారాబాద్ లో పడి కొట్టుకులాడుతున్నరు.  కార్పొరేట్  విద్యా సంస్థలు కూడా మొదలు విజయవాడ, గుంటూరు, నెల్లూరుల్లో వెలిశాయి. అక్కడే ఉంటే పోక వాళ్ళూ హైదారాబాద్ దారి పట్టిరి. మనకు దగ్గరగా మనం పెట్టుబళ్ళు పెట్టుకొంటే లాభమే కానీ నష్టం ఉండదు కదా.

 ఇక ప్రభుత్వోద్యోగులకు ట్రాన్స్ఫర్లు తప్పవు కదా. అదీ తమ ఊరికి దగ్గరకి అంటే సంతోషించాలి. వృద్దాప్యంలో ఉన్న తల్లిదండ్రులకు సేవకు అందుబాటులో ఉండొచ్చు. బంధు మిత్రుల మధ్యన ఉండొచ్చు. ఎంతైనా సొంత ఊరిపై మమకారం ఉంటుంది కదా. ఉద్యోగాలు యేమీ తీసెయ్యరు కదా. యెందుకింత గొడవో అర్ధం కాదు.

Sunday, August 4, 2013

ఆంధ్రాలో ప్రజాస్వామిక చోటు లేకనే జనం హైదారాబాద్ కు వచ్చి పడుతున్నరు

ఆంధ్రా తో పోలిస్తే తెలంగాణాలో ప్రజాస్వామిక చోటు ఎక్కువ. అందుకనే అక్కడి పెత్తందారీ వర్గాలతో బాటు చోటు దొరకని వర్గాలు కూడా తెలంగాణాకు తరలాయి. అక్కడ కులం ఫ్యాక్టర్ ఎక్కువ. పెత్తందారీ కులాలవాళ్ళు మామూలు వాళ్ళకు చోటు దొరకనీయరు. అందరూ ఇక్కడకొచ్చి ఫ్రెష్ గాలి పీలుస్తారు. ఇప్పుడు అక్కడికెళ్ళాలంటే వచ్చిన పెద్ద  చిక్కుల్లో ఇది కూడా ఒకటి.

అభివృద్దిని, పెట్టుబడులను హైదరాబాద్ లోనే కేంద్రీకరించే కంటే ప్రాంతీయంగా వికేంద్రీకరించడమే మంచి అభివృద్ది నమూనా అవుతుంది. హైదరాబాద్ ఓ వెర్రి అయి కూర్చుంది. యెంత ట్రాఫిక్, యెంత కాలుష్యం, యెన్ని అసౌకర్యాలు ఉన్నా అదే మెల్టింగ్ పాట్ అయిపోయింది జనాలకి.  హైదారాబాద్ లో  జీవన నాణ్యత తక్కువ. తెలంగాణా యేర్పాటుతోనైనా హైదారాబాద్ మీద ఒత్తిడి తగ్గితే మంచిది.

ఆంధ్రాలో కొత్త రాజధాని యేర్పాటుచేసుకోవడం కూడా విజ్ణతతో జరగాలి. ముఖ్యంగా సారవంతమైన, నీటి పారుదల వసతి కలిగిన పంట భూముల్ని కొత్త రాజధాని కొరకు వాడ కూడదు. సమీప భవిష్యత్తులో  ప్రపంచం మృత్తిక కరువును కూడా ఎదుర్కోవలసి వస్తుంది. ఈ విషయంలో విజయవాడ గుంటూరుల కంటే ఒంగోలు జిల్లా మార్కాపురం లాంటి మిట్ట ప్రాంతాలైతేనే మంచిది.