Tuesday, March 16, 2010

తెలంగాణ-సీమాంధ్ర నేతల మధ్యనున్న అంతరం?


డిసెంబరు 9 వతేదీ నాటి కేంద్ర హోంమంత్రి గారి ప్రకటన తర్వాత సీమాంధ్ర ఎంపీలు, ఎమ్మెల్యేలంతా కలసికట్టుగా మొత్తానికి మొత్తంగా రాజీనామాలు సమర్పించారు. తర్వాత కేంద్రం మాట మార్చినప్పుడు అదే స్థాయి స్పందన తెలంగాణ ప్రజాప్రతినిధులు కనపరచ లేక పోయారు. దీనికి రెండు ప్రాంతాల మధ్యనున్న ఆర్ధిక, రాజకీయ అంతరమే కారణం.

సీమాంధ్ర, తెలంగాణ నేతల మధ్యకూడా ఆ ప్రాంతాల మధ్యనున్నంత ఆర్ధిక ఆంతరం ఉంది. సీమాధ్ర నేతలకి ఈ పాటికే సరిపోను ఎస్టాబ్లిష్డ్‌ వ్యాపార, రియల్‌ ఎస్టేట్‌ సామ్రాజ్యాలు ఉన్నాయి. వారికి ఈ ఎంపీ, ఎమ్మెల్యే సీట్లొక లెక్కలోవి కావు. మళ్ళీ ఎన్నికలొచ్చినా సీట్లూ, ఓట్లూ తేలిగ్గా కొనుక్కోగల ఆర్ధిక సామర్ధ్యం వారికి ఉంది. అందుచేత వారికి రాజీనామాలొక లెక్కలోనివి కావు.

మెజార్టీ తెలంగాణ ఎంపీలు, ఎమ్మెల్యేల ఆర్ధిక పరిస్థితి అంత కాంక్రీట్‌గా లేకపోవడం వలననే వారు అంత సాహసంగా రాజీనామాలు చేయలేక పోయారు. సెంటిమెంటు మీద ఆధారపడిన టి.ఆర్‌.యస్‌. ఎమ్మెల్యేలకు దీనిలో కొంత మినహాయింపు ఉంది. మిగతా వారంతా ఎన్నికల్లో అంతో ఇంతో ఖర్చు చేసి పదవుల్లోకి వచ్చారు. ఇంత స్వల్ప వ్యవధిలో మళ్ళీ ఎన్నికలొస్తే వారి ఆర్ధిక పరిస్థితి దానిని తట్టుకో గల స్థాయిలో లేదు. అందుకనే వారు పదవులు వదులుకోవడానికి సిద్దపడలేక పోతున్నారు.

తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాల మధ్యకూడా ఈ అంతరాలు వాటి నేతల మధ్యనున్నంత స్థాయిలోనే ఉన్నాయి.


సీమాంధ్ర నేతలకున్న పెట్టుబళ్ళు, వ్యాపార సామ్రాజ్యాలే వారి బలం. సమెక్యాంధ్ర అని నినదించే వారి వెనుక ఆ ప్రాంత ప్రజాకాంక్షల కంటే వారి పెట్టుబళ్ళ బలమే ఎక్కువ. ఆ పెట్టుబళ్ళలో సింహ భాగం వారు హెదరాబాద్‌లో పెట్టి ఉండడం వలన సమస్య ఇంకా జటిలంగా మారింది. వారి ఆర్ధిక బలం ముందు తెలంగాణ రాజకీయ బలం తట్టుకొని నిలువలేక పోతుంది.

కాబట్టి తెలంగాణ వాదులు రాజకీయ ప్రక్రియల కంటే ప్రజా పోరాటాలను నమ్ముకోవడమే మంచిది.

Thursday, February 18, 2010

తెలంగాణ - ప్రజాకాంక్ష

తెలంగాణాలోని సామాన్య ప్రజానీకం తెలంగాణాని కోరుకోవడం లేదని అది రాజకీయ నాయకుల నినాదమేనని కొందరు సమైక్యవాదులు అంటున్నారు. ఈ వాదం చాలా అసంబద్దమైనది. భారతదేశానికి స్వాతంత్ర్యం కొరకు జాతీయవాదులు పోరాటం చేస్తున్నప్పుడు కూడా మనం అనుకొనే సామాన్య జనం పెద్దగా ఉర్రూతలేమీ వూగలేదు. మధ్య తరగతి మేధావులు ( శిష్ట వర్గం ) నడిపిన ఉద్యమం అది.

ఇలాంటి ఉద్యమాలన్నీవిద్యనేర్చి సాంప్రదాయక శ్రామిక జీవితంలోంచి బయట పడ్డ శిష్ట వర్గాల నుండే మొదలౌతాయి. దీనికి ఉదాహరణగా మన దేశ స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొన్న 95% మంది నాయకులను పేర్కొనవచ్చు. శిష్టవర్గాలకు మాత్రమే తాము, తమ ప్రాంతం ఎందువలన వెనుకబడి ఉన్నామో అర్ధమవుతుంది. ఇక రాజకీయాల విషయానికొస్తే ఏ చిన్నఉద్వేగం తమకు పనికొస్తుందన్నా వదులుకోరు. దానికి తెలంగాణా నాయకులు మాత్రమే కాకుండా సీమాంధ్ర మొదలుకొని భారత దేశంలోని ఏ నాయకులు కూడా అతీతులు కారు.

తెలంగాణా కొరకు పోరాడుతున్న వారిలో చదువుకొన్న శిష్ట వర్గాల కన్నా అనేక ప్రజాసంఘాలు, కవులు, కళాకారులు పోషిస్తున్న పాత్ర విశిష్టమైనది. దానిలో మనం నిజమైన, అట్టడుగు వర్గాల ప్రజాకాంక్షని ప్రత్యక్ష్యంగా చూడవచ్చు. కవులు, రచయితలు, కళాకారుల సృజనలే అయా సామాజాల అట్టడుగు వర్గాల పోరాటాల దిక్సూచి.

ఇంత కన్నా ప్రజాకాంక్షకి నిదర్శనం ఏమికావాలి?