Friday, December 6, 2013

'ఆధార్' మీద రాళ్ళేయడం అవివేకం

బ్యాంకు ఖాతాలతో ఆధార్ నెంబర్ ని అనుసంధానించి, గ్యాస్ సబ్సిడీని నగదు రూపంలో జమ చేయాలన్నది ప్రభుత్వ ఆలోచన. దాని కొరకు సామాన్యులు తిప్పలు పడుతున్నారు కాబట్టి ఆధార్ అనుసంధానం అవసరం లేదని కొందరి వాదన. కోర్టులకెక్కడం. రేషన్ కార్డు, పాన్ కార్డు, ఓటరు కార్డులుండగా ఇంకో ఆధార్ కార్డు ఎందుకని వాదన. ఆధార్  వ్యక్తిగత  గోప్యతని మంటగలుపుతుందని ఇంకొంతమంది నేర్చినవారి  వాదన.  కానీ అందరమూ తెలుసుకోవాల్సిన విషయమేమిటంటే ఇంత పెద్ద జనాభా కలిగిన దేశానికి అది అవసరమే. దాన్ని ప్రవేశ పెట్టిన ఉద్దేశ్యం అర్దం కాకనే ఈ రాద్దాంతాలు.

కంప్యూటర్లతో సమాచారాన్ని ప్రాసెస్ చేయడానికి, వివిధ లావాదేవీలను అనుసంధానం చేయడానికి, వ్యక్తుల ఆదాయాలను మధింపు చేసి పన్ను ఎగవేత, ఆర్ధిక నేరాలను పసిగట్టడానికి, నేరస్వభావం గల వ్యక్తుల కదలికలను పసిగట్టడానికి విశిష్ట గుర్తింపు సంఖ్య బాగా పనికి వస్తుంది. సమాచార సాంకేతిక పరిజ్జానాన్ని ఉపయోగించడం అంటే  ప్రభుత్వ పనికి ఒక కొత్త సునిశిత శక్తిని సమకూర్చుకోవడమే. ప్రభుత్వాల నుండి సమర్ధవంతమైన సేవలను డిమాండ్ చేస్తూ వాటి సామర్ధ్యాన్ని పెంచే పరికరాన్ని నిరాకరించడం వివేకం ఎలా అవుతుంది ?

రేషన్ కార్డు పౌర సరఫరాలకి, పాన్ కార్డు ఆర్ధిక లావాదేవీలకు, ఓటరు కార్డు ఓటు వేయడానికి గుర్తింపు, డ్రైవింగ్ లైసెన్స్ రవాణా శాఖకు ఇలా ప్రతిదీ దేనికదే ఆ శాఖ కార్యక్రమాల పరిధికే పరిమితమై ఉన్నాయి. కానీ మనిషి ఒక్కడే.  వీటన్నిటినీ అనుసాంధానించి వ్యవహారాలను నిర్వహించడానికి,  మధింపు చేయడానికి ఉద్దేశించిందే ఆధార్ నెంబరు.  అది సమాచార వ్యవస్థకు వెన్నెముక లాంటిది.

ఇక గోప్యత విషయానికికొస్తే , అసలు గోచీ గుడ్డలకే తడుముకొంటున్న వాళ్ళున్న దేశంలో  గోప్యత గురించి మాట్లాడడం అర్ధరహితం. సంపదను అక్రమంగా గోప్యంగా దాచుకోవడానికే  ఈ వాదన పనికి వస్తుంది.  దోచుకొనే వాడికి కూడా గోప్యత కావాలి. చిన్నల్లు మెయింటెయిన్ చేసే వాడికి కావాలి గోప్యత.  నెట్టింట్లో  ఉన్న వాళ్ళందరూ గోప్యత లేని వాళ్ళ కిందే లెక్క. ఇక కొత్తగా గోప్యతకు వచ్చే ముప్పేముంది?

వేలిముద్రలు సేకరించడం మీద కూడా ఆక్షేపణ ఉంది. కానీ తీవ్రవాదుల దాడులు జరిగినప్పుడు భద్రతా వైఫల్యమని విమర్శించేదీ మనమే. ప్రభుత్వాలు తమ సామర్ధ్యాలని పెంచుకోవడానికి , సమర్ధ సేవలు అందించడానికి ఆధార్ లాంటి పరికరము అవసరమే. కంప్యూటర్ల యుగంలో బూజుపట్టిన ఆలోచనలు పనికి రావు.

3 comments:

 1. వ్యక్తుల ఆదాయాలను మధింపు చేసి పన్ను ఎగవేత, ఆర్ధిక నేరాలను పసిగట్టడానికి, నేరస్వభావం గల వ్యక్తుల

  మీ వ్యాసం ఎలిమెంటరి స్కుల్ టిచర్ పిల్లలకి పాఠం చెప్పినట్లు ఉంది. దేశం లో సంపద మీద పన్ను ఎగవేసెది ఎవరో ? స్విస్ అకౌంట్లు, పి నోట్ల తో షెర్ మార్కేట్లో లావాదేవిలు చేసేది ఎవరో? అనుకొంటె వీరిని పట్టుకోవటం ప్రభుత్వానికి, రెండు నిముషాల పని. పన్ను ఎగవేత దారులను పట్టుకోవటానికి ఆధార్ అవసరం లేదు. ఫొలిటికల్ విల్ కావాలి.

  ReplyDelete
 2. సక్రమంగా వినియోగించుకుంటే ఆధార్ అభ్యంతరకరం కాదు నిరుపయుక్తమూ కాదు.
  అమెరికాను ఆ దేశంవారు ఫ్రీకంట్రీ అని చెప్పుకుంటారు. అక్కడ ఆ అమెరికాలో సోషల్ సెక్యూరిటీ అని ఒకటి ఉంది. అందరూ అది తప్పనిసరిగా తీసుకోవలసిందే. అది వ్యక్తులను గురించిన సమగ్రసమాచారాన్ని నిక్షిప్తం చేయటానికి వాడతారు. ప్రైవసీ గురించి ఎంతో పట్టుదలగా ఉండే అమెరికన్లే సోషల్ సెక్యూరిటీ విధానాన్ని నడిపించుకుంటుంటే, అచ్చం అలాంటిదే ఐన ఆధార్‌ను గురించి మనం యాగీ చేయవలసిన దేమీ లేదు.

  ReplyDelete
 3. @ అనానిమస్ గారికి ధన్యవాదములు. వ్యక్తులుగా రాజకీయ నాయకులు, వ్యక్తులుగా పెద్ద ఆర్ధిక నేరగాళ్ళను పట్టుకోరు కానీ ఒక లోపరహిత వ్యవస్థను నిర్మించడానికి, అపసవ్యమైన వ్యవహారాలను చెక్ చేస్తూ నిరోధించడానికి సాఫ్ట్ వేర్స్ రూపొందించడానికి యెవరూ అడ్డుపడరు. అది ఆధార్ తో మొదలు పెట్టవచ్చు.

  శ్యామలీయం గారికి కృతజ్ణతలు.

  ReplyDelete