Saturday, November 12, 2016

కరెన్సీ మార్పు


 కరెన్సీ నోట్ల మార్పుతో జనం తిప్పలు పడుతున్నా దీనిలో ఒక పాజిటివ్ కోణం చూడ్డానికి ప్రయత్నం. నామిత్రుడు ఒకాయన నవలలు రాద్దామని థీమ్ కోసం ఆలోచిస్తుంటే నాకున్న కొన్ని అలోచనలు చెప్పాను. అవేమిటంటే....  తెల్లారేసరికి ప్రభుత్వం అనేది మాయమైపోతే సమాజం ఎలా ఉంటుంది ? కరెంట్ ఇహ రాదంటే ఏంచేస్తారు? తీవ్రమైన కరువు వచ్చి ఇహ నీళ్ళు దొరకవంటే హైదారాబాద్ లో ఎలా బ్రతుకుతారు? ఊళ్ళకు వలసపోతారా? ఒకవేళ ఏదైనా యుద్దం వస్తే పరిస్థితులు ఎలా ఉంటాయి? మొదలైనవి. చెత్త ఆలోచనలు అని తిట్టమాకండేం.

చిన్నప్పుడు బాగా ఆకలి ఉన్నవాళ్ళను చూసి పెద్దవాళ్ళు కరువొస్తే ఎట్ల బతుకుతవురా అని అనేవాళ్ళు. నేనామధ్య ఇంటర్నెట్లో ఒక టాపిక్ సెర్చ్ చేశాను. అదేమిటంటే ఎక్కడికో దూర ప్రాంతానికి విహార యాత్రకు వెళ్ళినప్పుడు బ్యాగు, పర్సు, కార్డులు వగైరా పోతే ఎలా మేనేజ్ చేసుకోవాలి అని.

అలాగే ఉన్నట్టుండి దగ్గరున్న డబ్బులు చెల్లవంటే ఎలాగుంటుందో ఈ అనుభవం మనకు కొంత నేర్పింది. సమాజానికి ఇలాంటి చిన్న చిన్న కుదుపులు వస్తుంటే మార్పు అంటే ఏమిటి? ఎలాగుంటుంది? ఎలా తట్టుకోవాలి? ఎలా అధిగమించాలి? దేనికైనా ఎలా సిద్దంగా ఉండాలి? అనేవి తెలిసి వస్తుంది. కూడబెట్టుకున్న భద్రతలు ఏవీ నమ్మకం కావు, మారాల్సి వస్తుంది అనుకొన్నప్పుడు దురాశలు కూడా తగ్గుతాయి.

ఉదాహరణకు అసలు నోట్ల మార్పిడిని ఆపేసి కొంత మొత్తం దాటిన పైన ఎలెక్ట్రానిక్ వినిమయం మాత్రమే  ప్రవేశపెడితే ఎలా ఉంటుంది? ఇలాంటి ప్రయత్నానికి ఇది ఒక ట్రయల్ గా పనికివస్తుంది.


మార్పును తట్టుకోగలగటమే ముఖ్యం. ఎలెక్ట్రానిక్ యుగంలో ఈ మార్పులు త్వరత్వరగా వస్తాయి. అలా మారకపోతే సమాజం మనుగడ కష్టం అవుతుంది. ఆ ఫ్లెక్సిబులిటీ, షాక్ అబ్సార్ప్షన్ ఉండాలి. 

Sunday, February 7, 2016

మోట

మోట

తాతల కాలంలో అంటే సుమారు 1980 దాకా వ్యవసాయ బావుల్లో నుండి నీళ్ళు తోడే సాధనం మోట. నాకు బాగా  జ్ఞాపకముంది. పెద్దవాళ్ళు మోట తోలుతుంటే కాలువలో నీళ్ళలో ఆడుకోవడం. సరదాకి రెండు బొక్కెన్లు తోలడం. మోట  ఎడ్లకి, ముందుకి వెనక్కి నడవడం అనేది స్పెషల్ ట్రైనింగ్ కిందే లెక్క.  మోట తోలుకుంటూ బోర్ కొట్టకుండా పద్యాలు, యక్ష గానాలు కూడా పాడేవారు. జీతగాళ్ళు చుట్టత్రాగడం సరే సరి. మోటని బావికి అమర్చాలంటే ఆ వైపు దరిని రాతికట్టుతో పక్కాగా కట్టాలి. కొన్ని ఉళ్ళలో బావి నలువైపులా దరులు రాతితో కట్టినవి ఉండేవి. దేవరకొండ దగ్గర నేరేడుగొమ్మ గ్రామంలో ( హోమ్ మంత్రి నాయిని నర్సింహారెడ్డి గారి వూరు) ఆరు మోటల బావి అనే పేరు గల ఒక బావి ఉండేది. ఆరు మోటలట చూడండి. మోట బావి ఉన్న భాగ్యవంతులే వరి అన్నం తినగలిగేవారు. లేకుంటే జొన్న సంకటే.   

మోట మోకు తాల్చడం ఓ బృహత్కార్యం. మర్రిచెట్టు కొమ్మకి మొదలు కట్టి కింద అయిదుగురు అయిదు తాళ్ళని పట్టుకొని పురి పెడుతూ రిధమిక్ గా గుంజి ఒకరి తాడును పక్కనున్న ఇంకొకరికి మార్చుకొంటూ పేనుతారు. పిడికిలి లావు తాడు. పాత మోట బొక్కెనలు ఇంకా కొందరి ఇళ్ళలో కనిపిస్తాయి. మోట అనేది తెలంగాణలో వ్యావసాయక జీవనవిధానంలో ఓ ముఖ్యమైన అంశంగా ఉండేది.

ఇదంతా ఓ డాక్యుమెంటరీగా తీయాలనేది నా చిరకాల సంకల్పం. అదృష్టవశాత్తు ఇంటర్ నెట్ లో ఈ వీడియో దొరికింది. అయినా దీంట్లో నాస్మృతులన్నీ లేవు. వీలైతే లేదా స్పాన్సరర్లు, అభిరుచిగల వాళ్ళ తోడు దొరికితే పూర్తి వివరాలతో కళాత్మకంగా ఈ పురాస్మృతిని, అంతరించిన పోయిన మన జీవన విధానాన్ని డాక్యుమెంట్ చేయాలనే కోరిక ఇంకా ఉంది.            Tuesday, January 12, 2016

భగవద్గీత

 ఘంటసాల గారు గానం చేసిన భగవద్గీత రికార్డు వింటూంటే ఆ గానానికి, బ్యాక్ గ్రౌండ్ కంపోజిషన్ కి  మనస్సు గొప్ప ఆధ్యాత్మిక భావానికి లోనౌతుంది. ఆ రికార్డు తెలుగు వారందరికి ఒక కానుక. దానిని ఉదయాలలో, గుళ్ళలో  వినడం అలవాటు. మనసుకు ఒక రిలీఫ్, ఫ్రెష్ నెస్ కలుగుతుంది. వినీ వినీ అలవాటై ఏ సమయంలో విన్నా ఆ సుప్రభాత అనుభూతి పునరావృతమౌతుంది. 

అంత గొప్ప రికార్డుని ఇటీవలి కాలంలో తరచుగా ఎవరైనా చనిపోయినప్పుడు, అంతిమ యాత్రలలో వినిపిస్తున్నారు. అలా వినడం అలవాటైన జనాలకి  భగవద్గీత రికార్డు పెట్టగానే అంతిమ యాత్రలే గుర్తుకు వచ్చి, చివరకు దానిని అపశకున చిహ్నంగా భావించే దశకు చేరుతున్నారు. మన టి.వి. చానెళ్ళ వాళ్ళు కూడా ఎవరైనా చనిపోయినప్పుడు రోజంతా భగవద్గీతనే వినిపించడం దీనికి పరాకాష్ట.

ఒకరోజు ఉదయాన నేను భగవద్గీత రికార్డు పెట్టినప్పుడు నాకు సుప్రభాత - ఆధ్యాత్మిక అనుభూతి కలిగితే నా మిత్రుడికేమో అంతిమ యాత్రలే గుర్తుకు వస్తున్నాయని చెప్పాడు. ఎక్స్పోజర్, అసోసియివిటీ లలో ఉన్న మాయే అది.

నిజానికి భగవద్గీత అర్జునుణ్ణి కర్తవ్యోణ్ముకుణ్ణి  చేయడానికి బోధించబడినది.  ఆ వరుసలో జాతస్యహి మరణం ధృవం అనే శ్లోకం దానిలో ఉండడం వల్లనేమో ఈ రికార్డుని మరణ సందర్భాలలో వాడుతున్నారు.

జనన మరణాలు అనివార్యము, సహజమే అయినా, ఒక మంచి, గొప్ప, మనదైన సాంస్కృతిక సంపదని దాని ఉద్దేశిత లక్ష్యానికి కాకుండా దూరంగా తీసుకెళుతున్నామేమో అనిపిస్తుంది. దీని విషయమై ఆలోచిద్దాం.