Tuesday, March 31, 2009

మన అభివృద్ధి నమూనా పులిమీద స్వారీ చేయడంలాంటిదే

దేశాలకు ఆర్ధిక అభివృద్ది రేటు అనేది ఒక అగత్యంగా మారింది. పెరుగుదల రేటు ఉందంటేనే ఆ దేశం తన జనాభాకి ఉద్యోగావకాశాలను కల్పించగలుగుతుందని సాధారణ అభిప్రాయం. ఈ గ్రోత్ రేటు పెరుగుదల దేశాల ఆర్ధిక ఆరోగ్యానికి ప్రధాన సూచికగా మారింది. దీన్ని నిలబెట్టుకుందంటేనే ఆ దేశానికి ప్రపంచ మార్కెట్‌లో పరపతి ఉంటుంది. స్వదేశంలో కూడా ఆ ప్రభుత్వానికి విలువ ఉంటుంది. ఈ గ్రోత్ రేటుతో అందరికీ ఉద్యోగావకాశాలు కల్పించలేకున్నా, కనీసానికి ఆ గ్రోత్ రేటుని చూపించి దేశంలో సంక్షోభం రాకుండా చూసుకోవచ్చు. ఈ గ్రోత్ రేటుని సాధించలేని దేశాలు, ప్రభుత్వాలు సంక్షోభాలకి బాగా దగ్గర ఉన్నట్లుగా చెప్పుకోవచ్చు.

గ్రోత్ రేటు ఉన్నంత మాత్రాన పంపిణీ సమత్వం ఉంటుందన్న హామీ ఏమీ లేదు. పంపిణీ సమత్వం లేకున్నా కూడా గ్రోత్ రేటుని చూపించి ప్రభుత్వ విమర్శకుల నోర్లు మూయించ వచ్చు. ఇంక్లూజివ్ గ్రోత్ కొరకు పాటుపడుతున్నట్లుగా ప్రభుత్వాధినేతలు బుకాయించ వచ్చు. ఏదో రకంగా దాన్ని సాధించాలి. దేని పెరుగుదలనైనా ప్రభుత్వం ప్రోత్సహించాలి. దేశంలో ఆహారధాన్యాల ఉత్పత్తిని పెంచడం నిజమైన పెరుగుదలగా చెప్పుకోవచ్చు. వైద్యసేవలు పెరగడం కూడా అనుకూలాంశమే. మద్యం వినియోగం పెరగడం కూడా పెరుగుదలేనని అనుకోవాలా? ప్రభుత్వం దృష్టితో చూస్తే అవుననే చెప్పాలి. ఏదైనా వినిమయం పెరగడం ప్రభుత్వానికి పన్నుల కొరకు, సమాజానికి ఉద్యోగాల కొరకు తప్పని సరి అవసరంగా మారాయి. వినిమయాన్ని తగ్గించడం, పొదుపును ప్రోత్సహించడం దేశ ద్రోహం కింద జమగట్టే రోజులొచ్చాయి.

సంక్షోభ సమయంలో ఉద్యోగాలు నిలబడాలంటే వినిమయం తగ్గకూడదు. వినిమయం పెరగాలంటే బ్యాంకులు ఇంకా వడ్డీరేట్లని తగ్గించాలి. ప్రభుత్వం ఇటు పరిశ్రమల వారిని ఉద్యోగులను తొలగించకుండా బ్రతిమాలుకోవాలి. వినిమయం పెరిగేలా డబ్బులు అందుబాటులో ఉంచమని అటు బ్యాంకులను బ్రతిమాలుకోవాలి. ఎన్ని కష్టాలు? ఈ వలయంలో అసలు విషయం తప్పిపోయింది. అసలు వినిమయం దేనికొరకు? మనిషి అవసరాలు తీరడానికి. కానీ ఇక్కడ వినిమయం దేనికొరకంటే ఉద్యోగాలకొరకనే అర్ధం వచ్చింది. తోక కుక్కని ఊపడమంటే ఇదే.

గ్రోత్ రేటుని నిలబెట్టుకోవడానికే మన దేశం ప్రపంచీకరణకు ద్వారాలు తెరిచింది. శాస్త్ర-సాంకేతిక ప్రగతి ఉత్పత్తి విధానాలలో ఊహించలేనన్ని మార్పులు తీసుకొచ్చింది. అది సాంప్రదాయక ఉత్పత్తి విధానాలను పూర్వపక్షం చేసింది. దానితో పాత సామాజిక సంబంధాలు కూడా పెద్ద కుదుపుకు లోనైనాయి. యాంత్రీకరణ వలన తక్కువ శ్రమతో లేదా అసలు మానవ శ్రమ అవసరం లేకుండా ఉత్పత్తి సాధ్యపడింది. ప్రగతిశీలమని భావించిన విద్య, ఉత్పత్తి ప్రక్రియలో సాంకేతికతకు మాత్రమే పరిమితమైపోయింది. సాంకేతికతను సాధించే కొద్ది అది మానవ శ్రమని, మానవ ప్రమేయాన్ని తగ్గించడానికే దారితీసింది. ఏ చదువైనా శ్రమని తగ్గించడానికేననే సూత్రం పైన ఆధారపడి ఉంది. చదివిన వాడు శ్రమ పడడం నీచంగా అనుకొని ఉద్యోగాలకొరకు వెతుకుతాడు. అప్పటి దాకా, అంతకు ముందు తనకు ముందరి తరం వాళ్ళు చేసే పని మొరటుగా అనిపించి దాని నుండి తప్పించుకో జూస్తాడు లేదా తనకు ముందరి తరం వాళ్ళు చేసే వృత్తులు యాంత్రీకరణతో కుదుపులకు లోనై, ప్రాధాన్యత కోల్పోయి, రూపం మారి, వృత్తి జీవితం జీవికకు సరిపోని స్థితి కూడా వచ్చి ఉండవచ్చు. శ్రమ పడడు కాబట్టి ఉద్యోగం కావాలి. ఉద్యోగానికెక్కి ఇంకొందరికి పనిలేకుండా చేసే టెక్నిక్‌ని ప్రాక్టీస్ చేయాలి. దేన్నో ఆటోమేట్ చేయడం కొరకే చదువుకొన్నవారి చాలా ఉద్యోగాలు నిర్దేశించబడింది.

నిరుద్యోగం పెరగకుండా చూడాలంటే ఇప్పుడు లగ్జరీ అనుకొనే ఉత్పత్తులని అందరికీ అత్యవసరాలుగ మార్చే సంస్కృతిని తయారు చేయాలి. లేదా ఇంకా కొత్త అవసరాలని, ఉత్పత్తులని కనుక్కోవడమే పరిష్కారం. కొత్త ఉత్పత్తుల కొరకు కొత్తగా వనరులు కావాలి. జనాభా పెరిగింది కానీ భూమి, వనరులు పెరగవు కదా. వనరులు ఏ మూలలో, ఏ లోతుల్లో ఉన్నా వెలికి తీయాలి. వినియోగించాలి. ఆ వనరులు ఎవరికైనా జీవనాధారాన్ని కల్పిస్తున్నప్పటికీ వారు దానిలో ఉత్పత్తి చేసే జిడిపి తక్కువ కాబట్టి ఎక్కువ జిడిపిని సాధించగల వర్గం చేతుల్లోకి వెళ్ళాల్సిందే.

సరిపోను ఆహారోత్పత్తి చేసి ఉద్యోగాలున్నా లేకున్నా అందరికీ ఉచితంగా ఆహారాన్ని అందించినప్పటికీ చదువు, కనీస అభివృద్ధి లేక జనన రేటు అదుపులో ఉండదు. ఇంకా పెరగబోయే జనాభాకి కనీసం ఆహారాన్ని ఉత్పత్తి చేయడానికి కూడా వనరులు సరిపోవు. కాబట్టి చదువు, కనీస అభివృద్ది అనేవి తప్పనిసరి. చదువు వచ్చిన తర్వాత ఉద్యోగం కావాలి. ఉత్పత్తులు కావాలి.

జిడిపి అందరి అవసరం. పేదవానికి చదువు చెప్పించడానికి, ఆరోగ్యం కాపాడడానికి పన్నులు అవసరం. జిడిపి ఉంటేనే పన్నులు వస్తాయి. పేదవానికైనా, మధ్యతరగతి వానికైనా చదువు నేర్పిస్తే ఫలితం ఒక్కటే. జిడిపిని ఇంకొంత పెంచుకోవాల్సిన అగత్యాన్ని సృష్టించడమే. చదువుకొన్న తర్వాత అందరూ చేసే పని ఒక్కటే. ఇక్కడ పేదవాడు, పెట్టుబడిదారు అనే భేదం వాదనకే కానీ నిజానికి అందరికీ అగత్యమైన అభివృద్దే ఇది. పేదవాడు చదువుకొన్నా శ్రమని తప్పించుకొనడం, కొత్త టెక్నిక్‌ని కనిపెట్టడమనే ఆదర్శాలకొరకే పనిచేస్తాడు.

ఇప్పుడు ఇలా సంక్షోభం వస్తే కొన్నాళ్ళకు వనరుల కొరత, పర్యావరణ పరిమితులు సంక్షోభాలకు కారణాలు కానున్నాయి. మనం తలకెత్తుకొన్న అభివృద్ధి నమూనా పులిమీద స్వారీ చేయడం లాంటిదే. ప్రయాణం ఆపితే ప్రాణాలు దక్కవు.

సశేషం