Saturday, March 29, 2014

గుంజుకొచ్చేటోడే ఎమ్మెల్యే

మనకు మంచి ఎమ్మెల్యే యెవరయ్యా అంటే బాగా నిధులు గుంజుకొచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేటోడే. గంతనే. ఎమ్మెల్యే ఇంకేం జెయ్యాల? ఇదే అలవాటైపోయింది. అసలు మనము ఎమ్మెల్యేలని ఎందుకు ఎన్నుకొంటున్నామో మర్చిపోయినం.

బాగా అంటే బస్తాల కొద్దీ అన్నమాట. తీస్కరావాలె ఊళ్ళల్ల సి.సి. రోడ్లెయ్యాలె. టాయిలెట్లు లేకుంటెమాయె. ట్యాంకులు కట్టాలె. నీళ్ళు లేకుంటెమాయె.   నిధులు గుంజక రావడానికి ఆయన ఏ పాట్లైనా పడొచ్చు. ఆ గ్రూపు, ఈ గ్రూపు, వాణ్ణి బ్రతిమలాడి, వీణ్ణి బెదిరిచ్చి ఎట్లయితేనేమి గుంజక రావాలె. కుక్కల తీర్గ కొట్లాడాలె. గెల్వాలె.   ఇదీ జనంలో, సాధారణ కార్యకర్తల్లో ఉన్న అభిప్రాయం. లేకపోతే ఏం జేసిండయ్య అని శాపనార్ధాలు. 

వాళ్ళని విధాన సభకు విధానాల్ని రూపొందించే టందుకు పంపించిన సంగతే మర్చి పోతున్నం. వాళ్ళు అక్కడ సభలో కూర్చొని నిధులను మంజూరి చేయడానికి ప్రాతిపదికలు, ప్రాధాన్యాలను రూపొందించడానికి పంపించాం. అంతేగానీ కింద మీద బడి బస్తాలు నింపుకొని నియోజకవర్గానికి మోసుకొని రావడానికి కాదు. 

విధి విధానాలు పద్దతులు తయారు చేస్తే న్యాయంగా రావాల్సినవి వస్తాయి. తారతమ్యాలు ప్రాంతీయ బేధాలు ఉండవు. పెద్ద మంత్రి అయినాయిన అన్ని గుంజకపోంగ   చిన్న మంత్రిని అయిన నేనెందుకు గుంజక పోకూడదని తయారైనది. వాళ్ళు తయారు చేయాల్సిన ప్రాతిపదికలకు వాళ్ళే తూట్లు పొడుస్తారు. 

ఈ ప్రాతిపదికలు ప్రాధమ్యాలు గోంగూర కట్టలు అసలు తెలిసేది ఎందరికి. గెలిపించారు. వెళ్లారు. పార్టీలలో  పై వాళ్ళు ఏది చెబితే దానికి తలూపి బయటికి రావడమే మన వాళ్ళు చేస్తున్న పని. 

యెవడైనా పద్దతిగా ప్రాతిపదికలనే వెతుకుతూ కూర్చుంటాడో వాడొత్తి వాజెమ్మ అయిపోతాడు ఓటర్ల  దృష్టిలో.