Friday, May 9, 2014

మన రాజకీయాలు తయారు చేస్తున్న అభివృద్ధి నమూనాకి ఉదాహరణలు.

అభివృద్ధో అభివృధ్ధి అని గోల పెడుతున్నాం కదా! యేమిటది అని యెవరినైనా చిన్న నాయకుడిని అడిగితే ఊళ్ళల్లో సి.సి. రోడ్లు వేయడం, స్కూలు బిల్డింగులు కట్టడం, ఓవర్ హెడ్ ట్యాంకులు కట్టడం. ఇలా నిర్మాణాల్ని చూపిస్తారు. అదే అభివృధ్ధి అని చెబుతారు. ఇన్ని లక్షలు, కోట్లు వెచ్చిస్తున్నాం అని లెక్కలు చెబుతారు.

ఈ నిర్మాణాలే నిజంగా అభివృధ్ధా?  నేనొక మండలాధ్యక్షునితో వారి గ్రామానికి వారి కారులో వెళ్ళాను. కష్టపడి ఊళ్ళో సిసి. రోడ్లు వేయించాడు. కారు వెళ్ళడానికి బాగానే ఉంది. కానీ  గ్రామ సమీపానికి రాగానే కారు అద్దాలు ఎత్తండి ఎత్తండి అని నాకు కంగారుగా చెప్పారు.  ఎందుకంటే ఊళ్ళో టాయిలెట్లు లేవు. బహిరంగ మల విసర్జనతో   కంపు వాసన రాకుండా ఉండడానికి అద్దాలు ఎత్తమని చెబుతున్నాడు.

గ్రామంలో నీటి సరఫరాకి మొదటగా నీరు బాగా ఊరే వనరు కావాలి. తర్వాత ఆ బోరు / బావి నుండి నీరు సరఫరా చేసే మోటర్లు, పైపులైన్లు, ట్యాంకులు వగైరాలు కావాలి. బోరు, దానికి విద్యుత్తు లైను, మోటారు, పైపులైన్లు ఈ క్రమంలో పూర్తి అయిన తర్వాతే ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మించాలి. కానీ ఓవర్ హెడ్ ట్యాంకు ఒక ప్రతీక. మేము ఓవర్ హెడ్ ట్యాంకు నిర్మించాము అని ఘనంగా చెప్పుకోవడానికి పనికి వస్తుంది.  ఓవర్ హెడ్ ట్యాంకులు నిర్మిస్తే లాభాలు కూడా బాగా ఉంటాయి కాబట్టి వనరు సరిగ్గా ఉన్నా లేకున్నా ఓవర్ హెడ్ ట్యాంకుల నిర్మాణాలకు డిమాండ్. దానితో ట్యాంకులు కనపడతాయి కానీ ఊళ్ళో నీళ్ళు దొరకవు.

గ్రామాల్లో పాఠశాల భవనాల నిర్మాణం కూడా అంతే. దానిలో బోధించే ఉపాధ్యాయులు సరిపడా ఉండాలి. వారి బోధన మీద నమ్మకం కలిగి తల్లిదండ్రులు తమ పిల్లలను ఆ పాఠశాలకు పంపాలి. వారికి చదువు అబ్బాలి. ఇదీ అసలు అభివృద్ధి క్రమము. కానీ మన రాజకీయాలు భవనాల నిర్మాణం చుట్టూ, దాని కాంట్రాక్ట్ చుట్టూ తిరుగుతుంటాయి. భవన నిర్మాణాన్ని అభివృధ్ధి ప్రతీకగా చూపుతుంటారు కానీ దానిలో పిల్లలే ఉండరు.

లాభాలొచ్చే నిర్మాణాలని అభివృధ్ధి  ప్రతీకలుగా చూపిస్తూ ఉంటుంది మన రాజకీయ అభివృధ్ధి నమూనా. దాని మాయలో అందరూ పడిపోతారు. పెద్ద పెద్ద నీటిపారుదల ప్రాజెక్టులు కూడా అంతే. బృహన్నిర్మాణాలన్నీ పెద్దోల్ల అభివృధ్ధి కొరకే. ప్రతీకలు చూపించి మోసపుచ్చుతున్నారు. ఆ స్పృహ జనాలకు కలిగించాలి. ఈ ప్రతీకల మీద ఎంతో ప్రజాధనం ఖర్చు అవుతుంది కానీ జీవన ప్రమాణాలు మెరుగు పడడం లేదు.

నిర్మాణాలు ప్రధానం కాదు. సి.సి. రోడ్డు కాదు ముందు కావలసింది. పారిశుధ్యానికి ముందు మరుగుదొడ్డి కావాలి. సి.సి.రోడ్లకు పెట్టిన ఖర్చుతో ఎప్పుడో అందరికి మరుగుదొడ్లు కట్టించగలిగే వాళ్ళం. మరుగుదొడ్లు ఎందుకు కట్టించడంలేదు అంటే, దానితో మధ్య వాళ్ళకి ఏమీ లాభాలు లేవు కనుక. ఏది ప్రధానమో ఈ గోలలో వినిపించడం లేదు.

నిర్మాణాలు కావాలి. కానీ అవి మాత్రమే సరిపోవు. వాటిని పనిచేయించే వ్యవస్థలు పటిష్టంగా ఉండాలి.  ఈ నిర్మాణాలకు నిధులు గుంజుకొచ్చేనాయకులే మనకి హీరోలుగా కనిపిస్తున్నారు, కానీ వ్యవస్థను సవ్యంగా పనిచేయించే శాసనాలను తయారు చేసే తెలివి, నిబద్దత  వారికి ఉందా లేదా అనేది చర్చనీయాంశం కాకుండా పోయింది.







2 comments:

  1. You told the truth very clear and simple..

    ReplyDelete
  2. ప్రణాలికా బద్ధమైన ముందు చూపు లేకపోవడం, అజ్ఞానం ఇంకో కారణం.

    ఉదాహరణకి స్కూల్ ఉందనుకోండి, మొదటి విడతలో ఒక రూం కట్టడానికి అనుమతి వస్తే, ఏమాత్రం ముందు చూపు లేకుండా కట్టేస్తారు. రెండోది వస్తే దాని ముందుకో దాని పక్కనో కొంత గ్యాప్ పెట్టో కడతారు. ఇంకోటి వస్తే? అదే మొదటే ఒక రూం కి అనుమతి వచ్చినా , ఒక ప్రైమరీ స్కూల్ అయితే 5 లేదా 6 గదులు ఎప్పుడో పదేళ్ళలో అయిన సరే మంజూరు అయితే ఎలా కట్టాలో దానికి తగ్గట్టుగా కట్టడం వదిలేస్తే ఒక పద్దతిగా ఉంటుంది. మా ఊరి స్కూల్ ని చుస్తే చెప్పొచ్చు ఏ ఏ నిర్మాణం ఒక సారి కట్టింది కాదు అని. అదే వాళ్ళ ఇల్లు అయితే ఇలా చేస్తారా. ముందే పైన అంతస్తు వేస్తామేమో అని రాడ్స్ వదిలి మరీ కడతారు ఇల్లు.

    ReplyDelete