Sunday, January 25, 2009

మనిషికి ఏమి కావాలి?

1.జీవిక అవసరాలు: జీవించడానికి తిండి కావాలి. వాతావరణం నుండి రక్షించుకొనడానికి బట్టలు, ఇల్లు కావాలి.

2.లైంగిక ఆవసరాలు: సహజాతమైన కలయిక, తోడు, ప్రత్యుత్పత్తి

3. ఆత్మ అవసరాలు: తనని తాను, తనచుట్టూ ఉన్న ప్రపంచాన్ని, ప్రపంచంలో తనని తెలుసుకోవడం. తన ఉనికిని తాను స్పృహలో ఉంచుకోవడం, బయటి ప్రపంచానికి వ్యక్తపరచడం, చాటించుకోవడం, నిరూపించుకోవడం.

ఇవి విడివిడిగా చెప్పుకున్నప్పటికీ నిజానికి జీవితంలో విడదీయలేనంతగా అల్లుకు పోయి ఉంటాయి. ఇవ్వన్నీ అంతిమంగా వనరులని వినియోగించుకోవడం, ఇతరులతో సంబంధాలు నెరపడం రూపంలో ప్రతిఫలిస్తాయి. సంబంధాల మూలంగా, పరిమితుల మూలంగా వనరుల వినియోగమనేది షేర్ చేసుకోవలసిన అగత్యంగా రూపుదిద్దుకొంటుంది. సంబంధాలు ఏ విధంగా ఉండాలనేది సమాజం నిర్దేశిస్తుంది. వనరుల్ని ఏ పద్దతుల్లో షేర్ చేసుకోవాలనేది చట్టంగా రూపొందుతుంది.

జీవిక, లైంగిక అవసరాలు జంతువులకు కూడా ఉంటాయి. ఆత్మ అవసరాలు మనిషికి మాత్రమే ప్రత్యేకమైనవి. నిరూపించుకోవడం, చాటించుకోవడం లాంటి స్వయం వ్యక్తీకరణాలు జంతువుల్లో కూడా ఉంటాయి. పోరాడడం, గెలువడం, మనుగడ కొరకు పోరాడడం జంతువుల్లో కూడా ఉంటుంది. మనిషిలో విశిష్టంగా ఇక మిగిలి పోయింది తెలుసుకోవడం, స్పృహలో, తదవసరమైన క్రియలో ఉండడమే.

జీవిక, లైంగిక అవసరాల వలన ప్రపంచంలో ఏ విధ్వంసం జరుగదు. ఆత్మ అవసరాలైన అహం పొడిగింపు, వ్యక్తపరచుకోవడం, కూడబెట్టడం, నిరూపించుకోవడాల మూలంగానే వైరుధ్యాలు ఏర్పడతాయి, విధ్వంసం జరుగుతుంది. తెలుసుకోవడం స్పృహలో ఉండడం, తదనుగుణ క్రియలో ఉండడం మూలాన సమతౌల్యం ఉంటుంది. జీవిక, లైంగిక అవసరాలు తీరగానే మనిషి సమాజంలో తనని నిరూపించుకోవడం కొరకు ప్రాకులాడతాడు.

జీవిక అవసరాలు కూడా అంత తేలికగా తీరవు. ప్రకృతిని పరిశీలించి, శాస్త్రాన్ని నిర్మించిన మనిషి యంత్రాల సహాయంతో శ్రమని తగ్గించుకొనే ఉపాయాలు అనేకం కనిపెట్టాడు. దానితో జీవిక అవసరాలని తేలికగా నిర్వహించుకోవడం మొదలు పెట్టాడు. అయితే ఈ జీవిక అవసరాల కొరకు యాంత్రిక శక్తిని ఉపయోగించడమనేది కూడా ఇంకా అందరికీ పూర్తిగా అందుబాటులోకి రాలేదు. తెలివి కలవారు, చారిత్రకంగా ముందున్న వర్గాలకు మాత్రమే ఇవి అందుబాటులోకి వచ్చాయి. కాబట్టి ఇంకా చాలామందికి భౌతికంగా శ్రమ పడితే తప్ప జీవిక అవసరాలు తీరే పరిస్థితి లేదు. మానవుడు సహజాత పరంగా బద్దక జీవి. శ్రమని ఎప్పటికప్పుడు తప్పించుకోజూస్తాడు. ఇలా శ్రమను తప్పించుకోవడానికి రకరకాల మాయోపాయాలను పన్నుతాడు, సామాజిక సంబంధాలను, సంస్క­­ృతిని సృష్టిస్తాడు. ఇంత సోమరి మానవుడు కూడా గుట్టుచప్పుడు కాకుండా తిని పడుకొంటాడా అంటే అదీ కాదు. మళ్ళీ తన ఉనికిని ఏదో ఒక రకంగా ప్రకటించుకోవడానికి తాపత్రయపడుతూనే ఉంటాడు. దానికి రకరకాల పద్దతులను ఎంచుకొంటాడు. ఏదో రకంగా తన ఆధిపత్యాన్ని, తన ప్రత్యేకతని నిరూపించుకోవాలని పోరాటం చేస్తూనే ఉంటాడు. దాన్నే విజయమని అదే జీవిత లక్ష్యమని, జీవితాంతం దాని సాధనలోనే గడిపేస్తాడు.

ఒకరు ప్రకృతిని పరిశీలించి శాస్త్రాన్ని నిర్మిస్తారు. ఒకడు క్రొత్త వస్తువుని కనిపెడతాడు. కొందరు లలిత కళలలో ప్రావీణ్యం సంపాదిస్తారు. సాహిత్యాన్ని సృష్టిస్తారు. అందంగా కొందరు, బలంగా కొందరు తయారౌతారు, కొందరు క్రీడలలో, కొందరు నాయకత్వం వహించడంలో ప్రావీణ్యం సంపాదిస్తారు. ఇవ్వన్నీ కుదరని వారు, నేర్చుకోలేని వారు డబ్బు సంపాదించడమో, మాయోపాయాలు చేయడమో నేర్చి ఎలాగైతేనేం తమ విజయాన్ని నిరూపించుకో జూస్తారు. ఈ ఎలాగోలా తమ విజయాన్ని ఆధిపత్యాన్ని నిరూపించుకోవడమనేదే ప్రపంచంలోని విధ్వంసాలన్నిటికీ కారణం.

శ్రమ పడకుండా ఈ ఉనికి ప్రకటన, విజయం సాధించడం, ఆధిపత్య నిరూపణ అనేదే సకల అనర్దాలకు కారణం. అందరూ ఈ ఆదుర్దాలలో పడిపోయి పరుగులిడుతున్నప్పుడు జీవిక అవసరాలు తీరే అవకాశాలు కూడా సన్నగిల్లుతాయి. దానితో మొదలు అందరిలోనూ ఆర్జనపరత్వం తలెత్తుతుంది. తనకూ, తన సంతానానికి కొన్ని తరాలవరకు ఇంకా వీలైతే తరతరాలకు జీవిక అవసరాల నిమిత్తమైనా సంపాదించి కూడబెట్టాలనే బలమైన సామాజిక పరిస్థితి తయారైనది. ఇక యెవరనే భేదం లేకుండా శాస్త్రవేత్త, ఉత్పత్తిదారు, కళాకారుడు, సాహితీవేత్త, నాయకుడు ఎవరైనా సరే డబ్బు సంపాదించే పనిలోనే ఉంటారు. తమ విశిష్టతలనన్నిటినీ డబ్బుకు దాసోహమొనరుస్తారు. మిగిలింది పరుగు పందెం. దేన్నైనా త్రొక్కేస్తూ ముందుకు సాగడమే మనిషి విధిగా మారింది.

సర్దుబాటు, సహజీవనము, పరస్పర సహకారంలో ఆధిపత్య నిరూపణకి మనిషికి ఏ అవకాశమూ లేదు. ఉనికి ప్రకటించుకోవాలనే ఆదుర్దాకి అర్ధం ఏమిటి? ఆధిపత్యాన్ని నిరూపించుకోవలసిన అవసరం ఏమిటి? ఈ కోరికలకు మూలాలేమిటి? సహజాత స్థాయిలో బ్రతకడానికి పోరాడటం వేరు. బ్రతక నేర్చిన తర్వాత శ్రమని తప్పించుకొని ఈ పోరాటాలేమిటి?

వీటికి కారణం మనిషి తనని తాను, సమాజంలో, ప్రపంచంలో తన ఉనికి సరిగ్గా అర్ధం చేసుకోకపోవడమే. అలా అర్ధం చేసుకోనంతకాలం ప్రపంచంలో ఈ పెనుగులాటలు, విధ్వంసం, యుద్దాలు, సంక్షోభాలు తప్పవు. తెలుసుకోవడం, అర్ధం చేసుకోవడం, దానికి ప్రమాణాన్ని సాధించడాన్నే మనం సత్యాన్ని చేరుకోవడమని చెప్పవచ్చు.

8 comments:

  1. తనను తాను అధికుడుగా, ప్రత్యేకమైనవాడిగా వ్యక్త్తీకరించుకొనడం మనిషికి సహజమైన గుణమేమో.
    అసలు భాష పుట్టకే ఆ విధంగా జరిగిందట. ఇప్పుడు టెక్నాలజి కూడా అంతె. మనిషి ఉనికి మనిషికి బరువుగా మారింది. సహజీవనం మరిచి పోతున్నారు. మనిషి తనను తాను వ్యక్తీకరించుకొనె అవకాశము కాదు, మనుగడనే ప్రమాదంలోకి నెట్టె విధంగా టెక్నాలజిని ఉపయొగించుకుంటున్నాడు.
    ప్రపంచంలొ ఇప్పడివరకు కరువు అనేది నిజంగా ఎక్కడ రాలేదంటారు. జరిగినదేందంటె ప్రజల కొనుగోలు శక్తి పడిపోవడమే. wait for more

    ReplyDelete
  2. చాలా బాగా రాసారు. నెనరులు.

    ReplyDelete
  3. http://en.wikipedia.org/wiki/Evolution

    This may give some answers.

    ReplyDelete
  4. Hope you gone through the above web site. It explains what population (a man as an individual) needs. Some individuals adopt harmful, dangerous and unfavourable traits to survive which is rare. This occurs because individuals with these advantageous traits are more likely to reproduce, so that more individuals in the next generation inherit these traits.

    ReplyDelete
  5. శ్రీను,
    ఆ లింక్ తెరిచాను. కానీ సమయం దొరక్కపోవడం వలన పూర్తిగా చదవలేకపోయాను. ఏమైనా దాన్ని సూచించినందుకు థాంక్స్.

    కత్తి గారికి, నాగన్నగారికి కూడా ధన్యవాదములు.

    ReplyDelete
  6. Could you please provide your emailID in this blog. I would like to share some useful information with you.
    Regds,

    ReplyDelete
  7. మంచి ప్రారంభం.శుభమస్తు.అవిఘ్నమస్తు.కొనసాగించండి.వర్డ్ వెరిఫికేషన్ను తీసివేయండి.

    ReplyDelete