Friday, August 9, 2013

తెలుగు వాళ్ళకు రెండో రాజధాని ఇస్తామంటుంటే, దేశానికి రెండో రాజధాని అంటారేమిటి ?

ఇదెక్కడి గొడవండీ బాబూ.తెలుగు వాళ్ళకుఇంకో రాజధానిని ఇస్తామని పెద్దోళ్ళు అంటే సంతోషించాలి గానీ హైదారాబాద్ ని దేశానికి  రెండో రాజధానిని చేయాలని మాట్లాడతారేమిటి? మనకు ఇంకో ఇల్లు కట్టుకొనే అవకాశం వచ్చిందని సంతోషిస్తాం. దాన్ని ఎలా కట్టుకోవాలో ప్లాన్లు వేస్తాం. కలలు కంటాం. ఇదేంది.  యేం పాడైందని హైదారాబాద్ లో. అందరం యెగబడి ఖరాబు చేయడం కాకపోతే. రెండు మూడొందల కిలోమీటర్ల అనవసర ప్రయాణం తప్పితే.  కోట్ల రూపాయల ఫ్లాటు ఉండి యేం లాభం చుక్క నీరు దొరక్కుంటే. పేద్ద కారుంటే యేం లాభం దానికి తగ్గ రోడ్లే లేకుంటే. దాన్ని ఆపడానికి జాగానే లేకుంటే.  నిమిషానికి గజం వేగంతో కారులోనే పోవాలా.  యెవడు గుద్దుతాడో,  యెవనికి మనం గుద్దుతామో. టెన్షన్ తో నడపడమే కదా?  డబ్బులు గణించుకోవడమే కానీ జీవన నాణ్యత అవసరం లేదా?

కొత్త రాజధానిలో నైనా స్థలాలు, వ్యాపారాలు దొరుకుతాయి కదా. ఎక్కడ సెక్రటేరియట్ ఉండాలి. ఎక్కడ నివాసాలు ఉండాలి. పార్కులెక్కడ ఉండాలి. ఇవి ఆలోచించాలి. అన్ని రంగాలను ఇప్పటికైనా ఒకే చోట కుప్ప పోయకూడదనే తెలివిడి తెచ్చుకోవాలి. కొత్త రాష్ట్రానికి ఒకటి కాకపోతే రెండు రాజధానులు ఉండాలి. పరిపాలన వసతులు మాత్రమే అక్కడ నిర్మించుకోవాలి. విద్యా రంగం వేరే ఊళ్ళో , పారిశ్రామిక రంగం ఇంకొకచోట, ఐ.టి. పార్కులు ఒక టౌనులో ఇలా వికేంద్రీకరణ తప్పకా జరగాలి. లేకుంటే ఈ ఇరుకులు మురికి తప్పవు.

అసలు తెలుగువాళ్ళకు ఇదేం వెర్రి? అప్పుడేమో పోయి పోయి మద్రాసులో పడ్డారు. అసలు సినిమా రంగంలోని మెజారిటీ జనమంతా కృష్ణా, గోదావరి జిల్లాల వాళ్ళే కదా. యే రాజమండ్రిలోనో స్టూడియోలు నిర్మించుకోవచ్చు కదా? కళల కాణాచి పేరు సార్ధకమయ్యేది కదా? ఇప్పుడేమో హైదారాబాద్ లో పడి కొట్టుకులాడుతున్నరు.  కార్పొరేట్  విద్యా సంస్థలు కూడా మొదలు విజయవాడ, గుంటూరు, నెల్లూరుల్లో వెలిశాయి. అక్కడే ఉంటే పోక వాళ్ళూ హైదారాబాద్ దారి పట్టిరి. మనకు దగ్గరగా మనం పెట్టుబళ్ళు పెట్టుకొంటే లాభమే కానీ నష్టం ఉండదు కదా.

 ఇక ప్రభుత్వోద్యోగులకు ట్రాన్స్ఫర్లు తప్పవు కదా. అదీ తమ ఊరికి దగ్గరకి అంటే సంతోషించాలి. వృద్దాప్యంలో ఉన్న తల్లిదండ్రులకు సేవకు అందుబాటులో ఉండొచ్చు. బంధు మిత్రుల మధ్యన ఉండొచ్చు. ఎంతైనా సొంత ఊరిపై మమకారం ఉంటుంది కదా. ఉద్యోగాలు యేమీ తీసెయ్యరు కదా. యెందుకింత గొడవో అర్ధం కాదు.

Sunday, August 4, 2013

ఆంధ్రాలో ప్రజాస్వామిక చోటు లేకనే జనం హైదారాబాద్ కు వచ్చి పడుతున్నరు

ఆంధ్రా తో పోలిస్తే తెలంగాణాలో ప్రజాస్వామిక చోటు ఎక్కువ. అందుకనే అక్కడి పెత్తందారీ వర్గాలతో బాటు చోటు దొరకని వర్గాలు కూడా తెలంగాణాకు తరలాయి. అక్కడ కులం ఫ్యాక్టర్ ఎక్కువ. పెత్తందారీ కులాలవాళ్ళు మామూలు వాళ్ళకు చోటు దొరకనీయరు. అందరూ ఇక్కడకొచ్చి ఫ్రెష్ గాలి పీలుస్తారు. ఇప్పుడు అక్కడికెళ్ళాలంటే వచ్చిన పెద్ద  చిక్కుల్లో ఇది కూడా ఒకటి.

అభివృద్దిని, పెట్టుబడులను హైదరాబాద్ లోనే కేంద్రీకరించే కంటే ప్రాంతీయంగా వికేంద్రీకరించడమే మంచి అభివృద్ది నమూనా అవుతుంది. హైదరాబాద్ ఓ వెర్రి అయి కూర్చుంది. యెంత ట్రాఫిక్, యెంత కాలుష్యం, యెన్ని అసౌకర్యాలు ఉన్నా అదే మెల్టింగ్ పాట్ అయిపోయింది జనాలకి.  హైదారాబాద్ లో  జీవన నాణ్యత తక్కువ. తెలంగాణా యేర్పాటుతోనైనా హైదారాబాద్ మీద ఒత్తిడి తగ్గితే మంచిది.

ఆంధ్రాలో కొత్త రాజధాని యేర్పాటుచేసుకోవడం కూడా విజ్ణతతో జరగాలి. ముఖ్యంగా సారవంతమైన, నీటి పారుదల వసతి కలిగిన పంట భూముల్ని కొత్త రాజధాని కొరకు వాడ కూడదు. సమీప భవిష్యత్తులో  ప్రపంచం మృత్తిక కరువును కూడా ఎదుర్కోవలసి వస్తుంది. ఈ విషయంలో విజయవాడ గుంటూరుల కంటే ఒంగోలు జిల్లా మార్కాపురం లాంటి మిట్ట ప్రాంతాలైతేనే మంచిది.

Saturday, November 5, 2011

తెలంగాణా ఉద్యోగుల సమ్మె- సమీక్ష

గ్లోబలైజేషన్ వచ్చింది అన్నింటినీ మింగేసింది అని అనుకొన్నాను. యిజాలన్నిటికీ కాలం చెల్లిందనేది యెంత తప్పుడు భావనో తెలంగాణా పోరాటాణ్ణి చూస్తే తెలుస్తుంది. యెవనిది వాడు చూసుకొనే కాలం ఇది, పోరాటాలకు కాలం చెల్లిందకొని పొరబడ్డాను.

మేము (ప్రభుత్వ ఉద్యోగులము) చేసిన సమ్మె తో చాలా నమ్మకం పెరిగింది. చిన్న ఉద్యోగస్తుని దగ్గరి నుండి జిల్లా స్థాయి అధికారుల వరకు కూడా అదే స్ఫూర్తితో సమ్మెలో పాల్గొన్నారు. యేస్థాయి వారైనా కూడా జీతాలు రావట్లేదు కాబట్టి సమ్మెను ఆపుదాము అనలేదు.

సీమాంధ్ర ప్రాంతానికి చెందిన మాకోలీగ్స్ కూడా సమ్మెలో పాల్గొన్నారు. కొన్ని చోట్లలో గ్రామాల్లో తిరిగి ప్రత్యేక తెలంగాణా ఆవశ్యకతను స్వయంగా ప్రచారం కూడా చేశారు. తెలంగాణా జోన్లలో రిక్రూటయిన పాపానికి ఆంధ్రా ప్రాంతానికి చెందినవారైనప్పటికీ వారు ప్రమోషన్లలో ఎదుర్కొంటున్న వివక్షను మాకంటే బాగా గుర్తించారు.


ఉద్యోగస్తుల సమ్మెతో తెలంగాణా వస్తుందా అని కొందరన్నారు. కానీ ఉద్యోగస్తుల సమ్మెతో తెలంగాణా వాదం మామూలు ఓటరు స్థాయి దాకా బలంగా చేరింది. సమ్మెతో రాజకీయ వర్గాలపై వత్తిడి పెరిగింది. యెవరు యేమి మోసాలు చేస్తున్నారో ప్రజలకు బాగా అర్ధం అయింది. ఆ విధంగా సమ్మె విజయవంతమైనట్లే లెక్క.















Friday, April 8, 2011

సత్యానికి ఉన్న శక్తి

డెబ్భై యేండ్ల అర్భక వృద్ధుడు అన్నా హజారేకి ఈ శక్తి ఎలా వచ్చింది? ఇంత మంది ఎలా బాసటగా నిలుస్తున్నారు?



అదే సత్యానికున్న శక్తి. సత్యాన్ని మాత్రమే నమ్ముకున్న వ్యక్తికి వచ్చిన శక్తి.

సత్యానికి నిలబడితే మనందరికీ ఈ శక్తి వస్తుంది.


Tuesday, March 16, 2010

తెలంగాణ-సీమాంధ్ర నేతల మధ్యనున్న అంతరం?


డిసెంబరు 9 వతేదీ నాటి కేంద్ర హోంమంత్రి గారి ప్రకటన తర్వాత సీమాంధ్ర ఎంపీలు, ఎమ్మెల్యేలంతా కలసికట్టుగా మొత్తానికి మొత్తంగా రాజీనామాలు సమర్పించారు. తర్వాత కేంద్రం మాట మార్చినప్పుడు అదే స్థాయి స్పందన తెలంగాణ ప్రజాప్రతినిధులు కనపరచ లేక పోయారు. దీనికి రెండు ప్రాంతాల మధ్యనున్న ఆర్ధిక, రాజకీయ అంతరమే కారణం.

సీమాంధ్ర, తెలంగాణ నేతల మధ్యకూడా ఆ ప్రాంతాల మధ్యనున్నంత ఆర్ధిక ఆంతరం ఉంది. సీమాధ్ర నేతలకి ఈ పాటికే సరిపోను ఎస్టాబ్లిష్డ్‌ వ్యాపార, రియల్‌ ఎస్టేట్‌ సామ్రాజ్యాలు ఉన్నాయి. వారికి ఈ ఎంపీ, ఎమ్మెల్యే సీట్లొక లెక్కలోవి కావు. మళ్ళీ ఎన్నికలొచ్చినా సీట్లూ, ఓట్లూ తేలిగ్గా కొనుక్కోగల ఆర్ధిక సామర్ధ్యం వారికి ఉంది. అందుచేత వారికి రాజీనామాలొక లెక్కలోనివి కావు.

మెజార్టీ తెలంగాణ ఎంపీలు, ఎమ్మెల్యేల ఆర్ధిక పరిస్థితి అంత కాంక్రీట్‌గా లేకపోవడం వలననే వారు అంత సాహసంగా రాజీనామాలు చేయలేక పోయారు. సెంటిమెంటు మీద ఆధారపడిన టి.ఆర్‌.యస్‌. ఎమ్మెల్యేలకు దీనిలో కొంత మినహాయింపు ఉంది. మిగతా వారంతా ఎన్నికల్లో అంతో ఇంతో ఖర్చు చేసి పదవుల్లోకి వచ్చారు. ఇంత స్వల్ప వ్యవధిలో మళ్ళీ ఎన్నికలొస్తే వారి ఆర్ధిక పరిస్థితి దానిని తట్టుకో గల స్థాయిలో లేదు. అందుకనే వారు పదవులు వదులుకోవడానికి సిద్దపడలేక పోతున్నారు.

తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాల మధ్యకూడా ఈ అంతరాలు వాటి నేతల మధ్యనున్నంత స్థాయిలోనే ఉన్నాయి.


సీమాంధ్ర నేతలకున్న పెట్టుబళ్ళు, వ్యాపార సామ్రాజ్యాలే వారి బలం. సమెక్యాంధ్ర అని నినదించే వారి వెనుక ఆ ప్రాంత ప్రజాకాంక్షల కంటే వారి పెట్టుబళ్ళ బలమే ఎక్కువ. ఆ పెట్టుబళ్ళలో సింహ భాగం వారు హెదరాబాద్‌లో పెట్టి ఉండడం వలన సమస్య ఇంకా జటిలంగా మారింది. వారి ఆర్ధిక బలం ముందు తెలంగాణ రాజకీయ బలం తట్టుకొని నిలువలేక పోతుంది.

కాబట్టి తెలంగాణ వాదులు రాజకీయ ప్రక్రియల కంటే ప్రజా పోరాటాలను నమ్ముకోవడమే మంచిది.

Thursday, February 18, 2010

తెలంగాణ - ప్రజాకాంక్ష

తెలంగాణాలోని సామాన్య ప్రజానీకం తెలంగాణాని కోరుకోవడం లేదని అది రాజకీయ నాయకుల నినాదమేనని కొందరు సమైక్యవాదులు అంటున్నారు. ఈ వాదం చాలా అసంబద్దమైనది. భారతదేశానికి స్వాతంత్ర్యం కొరకు జాతీయవాదులు పోరాటం చేస్తున్నప్పుడు కూడా మనం అనుకొనే సామాన్య జనం పెద్దగా ఉర్రూతలేమీ వూగలేదు. మధ్య తరగతి మేధావులు ( శిష్ట వర్గం ) నడిపిన ఉద్యమం అది.

ఇలాంటి ఉద్యమాలన్నీవిద్యనేర్చి సాంప్రదాయక శ్రామిక జీవితంలోంచి బయట పడ్డ శిష్ట వర్గాల నుండే మొదలౌతాయి. దీనికి ఉదాహరణగా మన దేశ స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొన్న 95% మంది నాయకులను పేర్కొనవచ్చు. శిష్టవర్గాలకు మాత్రమే తాము, తమ ప్రాంతం ఎందువలన వెనుకబడి ఉన్నామో అర్ధమవుతుంది. ఇక రాజకీయాల విషయానికొస్తే ఏ చిన్నఉద్వేగం తమకు పనికొస్తుందన్నా వదులుకోరు. దానికి తెలంగాణా నాయకులు మాత్రమే కాకుండా సీమాంధ్ర మొదలుకొని భారత దేశంలోని ఏ నాయకులు కూడా అతీతులు కారు.

తెలంగాణా కొరకు పోరాడుతున్న వారిలో చదువుకొన్న శిష్ట వర్గాల కన్నా అనేక ప్రజాసంఘాలు, కవులు, కళాకారులు పోషిస్తున్న పాత్ర విశిష్టమైనది. దానిలో మనం నిజమైన, అట్టడుగు వర్గాల ప్రజాకాంక్షని ప్రత్యక్ష్యంగా చూడవచ్చు. కవులు, రచయితలు, కళాకారుల సృజనలే అయా సామాజాల అట్టడుగు వర్గాల పోరాటాల దిక్సూచి.

ఇంత కన్నా ప్రజాకాంక్షకి నిదర్శనం ఏమికావాలి?

Thursday, June 25, 2009

భారత ఐ.టి. రంగానికి సంతోషకరమైన వార్త

మన దేశ నాయకత్వానికి నిజంగా కృతజ్ఙతలు చెప్పాల్సిన రోజిది. దేశ ప్రజలందరికీ యూనిక్ గుర్తింపు నెంబరు కేటాయించడానికి ్‌యూనిక్ ఐడెంటిఫికేషన్ డేటాబేస్ అథార్టీ ఆఫ్ ఇండియ్ా ని ఏర్పాటు చేసి దానికి శ్రీ నందన్ నీలేకని గారిని దానికి ఛైర్మన్‌గా నియమించారు. 2011 కల్లా అందరికీ ఏకాంకిత గుర్తింపు నెంబరు కేటాయిస్తారు. తర్వాత అన్ని వ్యవహార లావాదేవీలలో దానిని ఉపయోగించడం ద్వారా ప్రభుత్వ కార్యక్రమాలను, సేవలను, సంక్షేమ పథకాలను సక్రమంగా , వేగవంతంగా , పారదర్శకంగా నిర్వహించడానికి అవకాశం ఉంటుంది.

సంక్షోభంలో ఉన్న ఐ.టి. రంగానికి ఇది కొంత ఊరట.మనదేశ ఐ.టి. రంగం పూర్తిగా విదేశాలకు సేవలు అందించడానికే ఇప్పటివరకు పనిచేస్తూంది. వాళ్ళ టూత్ పేస్టులు, సబ్బుల లెక్కల దగ్గరినుండి అన్ని లెక్కలు మనమే నిర్వహిస్తూ వచ్చాము. మనం ఇప్పటినుండైనా మన లెక్కలు చేయడానికి ప్రభుత్వం సంకల్పించింది. కనీసం ఇక్కడ మనుషుల లెక్కలు కూడా సరిగ్గా లేవు. ఏదైనా ప్రభుత్వ కార్యాలయానికి పని కొరకు వెళ్ళి టేబుల్ ముందు నిల్చున్నా నువ్వెవరో మాకు తెలియదు. నువ్వు బతికి ఉన్నావో చనిపోయావో కూడా తెలియదు. ప్రతీ దానికి సర్టిఫికేట్లు ఉంటే మాత్రమే నీ వ్యవహారం ముందుకెళుతుందని సమాధానం ఉంటుంది. ఈ గుర్తింపు, లెక్కలు ఝంజాటాలు పోవాలి. ఒక నెంబరు చెబితే ఒక వ్యక్తికి చెందిన అధీకృత సమాచారం మొత్తం నెట్‌వర్క్, డేటాబేస్‌ల ద్వారా సంగ్రహించే అవకాశం ఉండాలి.

కొంత కదలిక వచ్చింది. దేశంలో ఐ.టి. రంగంలో పనిచేసే వారందరూ దీన్ని గమనించాలి. అర్ధం చేసుకోవాలి. విమర్శించాలి. సూచనలివ్వాలి. ప్రభుత్వాలని డిమాండ్ చేయాలి. ఇంత జనాభా, వైశాల్యం గల మనదేశంలో ప్రభుత్వ సమాచారయాజమాన్యం అనేది చాలా పెద్ద పని. దానితో చాలా ఐ.టి. ప్రాజెక్టులు కొత్తవి వచ్చే అవకాశం ఉంది. మన ఐ.టి. నిపుణులకు మనదేశంలోనే మనపనిచేయడంలోనే ఉద్యోగాలు దొరికే అవకాశం ఉంది. దీనిని స్వాగతిద్దాం.