Thursday, June 25, 2009

భారత ఐ.టి. రంగానికి సంతోషకరమైన వార్త

మన దేశ నాయకత్వానికి నిజంగా కృతజ్ఙతలు చెప్పాల్సిన రోజిది. దేశ ప్రజలందరికీ యూనిక్ గుర్తింపు నెంబరు కేటాయించడానికి ్‌యూనిక్ ఐడెంటిఫికేషన్ డేటాబేస్ అథార్టీ ఆఫ్ ఇండియ్ా ని ఏర్పాటు చేసి దానికి శ్రీ నందన్ నీలేకని గారిని దానికి ఛైర్మన్‌గా నియమించారు. 2011 కల్లా అందరికీ ఏకాంకిత గుర్తింపు నెంబరు కేటాయిస్తారు. తర్వాత అన్ని వ్యవహార లావాదేవీలలో దానిని ఉపయోగించడం ద్వారా ప్రభుత్వ కార్యక్రమాలను, సేవలను, సంక్షేమ పథకాలను సక్రమంగా , వేగవంతంగా , పారదర్శకంగా నిర్వహించడానికి అవకాశం ఉంటుంది.

సంక్షోభంలో ఉన్న ఐ.టి. రంగానికి ఇది కొంత ఊరట.మనదేశ ఐ.టి. రంగం పూర్తిగా విదేశాలకు సేవలు అందించడానికే ఇప్పటివరకు పనిచేస్తూంది. వాళ్ళ టూత్ పేస్టులు, సబ్బుల లెక్కల దగ్గరినుండి అన్ని లెక్కలు మనమే నిర్వహిస్తూ వచ్చాము. మనం ఇప్పటినుండైనా మన లెక్కలు చేయడానికి ప్రభుత్వం సంకల్పించింది. కనీసం ఇక్కడ మనుషుల లెక్కలు కూడా సరిగ్గా లేవు. ఏదైనా ప్రభుత్వ కార్యాలయానికి పని కొరకు వెళ్ళి టేబుల్ ముందు నిల్చున్నా నువ్వెవరో మాకు తెలియదు. నువ్వు బతికి ఉన్నావో చనిపోయావో కూడా తెలియదు. ప్రతీ దానికి సర్టిఫికేట్లు ఉంటే మాత్రమే నీ వ్యవహారం ముందుకెళుతుందని సమాధానం ఉంటుంది. ఈ గుర్తింపు, లెక్కలు ఝంజాటాలు పోవాలి. ఒక నెంబరు చెబితే ఒక వ్యక్తికి చెందిన అధీకృత సమాచారం మొత్తం నెట్‌వర్క్, డేటాబేస్‌ల ద్వారా సంగ్రహించే అవకాశం ఉండాలి.

కొంత కదలిక వచ్చింది. దేశంలో ఐ.టి. రంగంలో పనిచేసే వారందరూ దీన్ని గమనించాలి. అర్ధం చేసుకోవాలి. విమర్శించాలి. సూచనలివ్వాలి. ప్రభుత్వాలని డిమాండ్ చేయాలి. ఇంత జనాభా, వైశాల్యం గల మనదేశంలో ప్రభుత్వ సమాచారయాజమాన్యం అనేది చాలా పెద్ద పని. దానితో చాలా ఐ.టి. ప్రాజెక్టులు కొత్తవి వచ్చే అవకాశం ఉంది. మన ఐ.టి. నిపుణులకు మనదేశంలోనే మనపనిచేయడంలోనే ఉద్యోగాలు దొరికే అవకాశం ఉంది. దీనిని స్వాగతిద్దాం.

1 comment:

  1. దీన్ని చిత్తశుద్ధితో అమలుపరిస్తే చాలా మంచిదే.అది మనదేశనాయకులకు ఉందా అని అనుమానం .వాళ్ళ ఓటుబ్యాంకుకేమైనా ఇబ్బంది అయితే అది బుట్టదాఖలే,లేదంటే రూపం మారిపోతుంది.చరిత్ర అదే చెబుతోంది. ఎన్ని వక్రమార్గాలు వస్తాయో మళ్ళీ దానిని చెడగొట్టడానికి.చూద్దాం ఏమి చేస్తారో !

    ReplyDelete