Thursday, October 23, 2014

పత్తి పత్తి

ఎక్కడ చూసినా పత్తి పంటే. నేషనల్ హైవే వెంట నుండి మారుమూల చందంపేట లోపల పొగిళ్ళ దాకా పత్తి పంటే.     భూములన్నిటా  పత్తే పెడితే తిండి పండించడం ఎక్కడో? పత్తి ఎగుమతి చేసి తిండి గింజలు దిగుమతి చేసుకోవాలా?  గిరిజనుల సాంప్రదాయక ఆహారం జొన్న రొట్టె. చందంపేట మండలమైనా, దేవరకొండ మొత్తమైనా ఎక్కడా జొన్న చేను కనపడదు. మహారాష్ట్ర నుండి లారీల కొలది దిగుమతి చేసుకొంటారట .

ఎందుకు ఇంత పత్తి ? ఇన్ని బట్టలు కావాలా? వనరులను పొదుపుగా వాడుకోవాలి. పెట్టుబడులు లాభాలు నష్టాలు లెక్కలు ఎక్కువైపోయి ఆత్మహత్యలు.

పెసర చేలు కూడా కంటికి కనపడడం లేదు. ఏం తిని బతుకుదామో అర్ధం కాదు. ఆ పంట కొంత ఈ పంట కొంత ఇలా రకరకాల పంటలు వేస్తే ఎదో ఒక్కటైనా ఆదుకోక పోదు. వైవిధ్యం అవసరం. 

Wednesday, October 8, 2014

స్వచ్ఛ భారత్ తరుణం

ఎన్నో మార్పుల్ని, ఎంతో అభివృద్ధిని చూస్తున్న మనం పారిశుధ్యం  విషయంలో మార్పు కొరకు కృషి చేయాల్సిన తరుణం ఇదే. ప్రభుత్వం ఇచ్చిన పిలుపుకు స్పందిద్దాము.

గ్రామీణ మంచినీరు - పారిశుధ్య శాఖలోనే పనిచేస్తున్న నేను పథకము అమలు విషయంలో కొన్ని అనుభవాల్ని అందరితో పంచుకోదలచాను. మరుగుదొడ్డి కట్టుకోవడానికి ప్రభుత్వ సబ్సిడీ పంపిణి విషయమై విధానాలను మాటి మాటికి మార్చడం వలన పెద్ద గందరగోళం తయారౌతుంది. ఒక వేవ్ కి ఇంకో వేవ్ కి మధ్య కట్టుకొన్న వాళ్ళు అటూ ఇటూ కాక సబ్సిడి రాక పాత దొడ్డి చూపించి సబ్సిడీ ఇవ్వమంటారు. ఒక్కనికి పాతదానికి ఇస్తే అందరూ ఇంకోసారి తీసుకోవడానికి ఎగబడతారు. అమలు చేసే యంత్రాంగం ఈ నెత్తి నొప్పి, బ్లాక్ మెయిళ్ళు భరించ లేక చేతులెత్తేసి కాలం గడిపేస్తున్నారు. కాబట్టి చాలా పకడ్బందీ గా సంకల్ప శుద్ధితో, పూర్తిగా అయిపోయేదాకా వెంట పడితేనే ఫలితం ఉంటుంది.


పారిశుధ్య విద్య కుడా అవసరం. విద్యాలయాల్లో పారిశుధ్య పరిస్థితులు ఘోరం. దానికి అందరిదీ బాధ్యత. మొదలు దాన్ని మంజూరి చేసేప్పుడే సరిపోను నిధులు మంజూరి చేయక, చవకగా ఎలా కట్టాలో ముష్టి సలహాలు మోడల్స్ ఇచ్చి కట్టమంటారు.  చాలా గట్టిగా, ధృఢంగా కడితేనే మన వాళ్ళతో ఆగవు. సస్తాలో కట్టాలని చూస్తే అవి వెంటనే  మూలకు పడతాయి. వాటికి నీటి సరఫరా కావాలి. పాఠశాలకే బోరు మోటరు ఇస్తే కరెంటు బిల్లు, రిపేర్లతో హెడ్మాష్టర్లకు నెత్తి నొప్పి. స్వీపర్లకే జీతాలు ఇవ్వలేని పరిస్థితి.  గ్రామ పంచాయతీ నల్లాలో ఓట్లున్న వారికి, నోరున్న వారికే నీళ్ళు అందుతాయి.  అదీ ఏ రాత్రో, ఏ జామో.

పాడైన వాటిని తిరిగి శుభ్రం చేయించడానికి మనుషులు ఎవరూ దొరకరు.  ఎవరి పాఠశాలను వారే అక్కడి విద్యార్ధులు, ఉపాధ్యాయులు అందరూ వంతులు వేసుకొని శుభ్రం చేయాలి. ఈ విషయం ఇలా చెప్పిన అధికారిణి ని గత ప్రభుత్వం తప్పు పట్టి ఆ పోస్టు నుండి తప్పించినట్లు గుర్తు. ఈ విషయంలో స్పష్టత లేకుంటే ఎన్ని కట్టించినా నిష్ప్రయోజనమే.

స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, చోటా నాయకులకు కాట్రాక్టులు చేసుకోవడానికి ఊళ్ళల్లో సిమెంటు రోడ్లు బాగా ఉపకరిస్తాయి. టాయిలెట్లు పూర్తిగా కట్టుకొన్న ఊరికే సిమెంటు రోడ్లు మంజూరి చేసే నిబంధనని అమలు చేయడం కష్టమేమీ కాదు.  అసలు సి.సి. రోడ్లకు పెట్టిన పైసల్లో పావు వంతు టాయిలెట్లకు పెట్టినా  అన్నీ పూర్తి అయ్యి ఉండేవి.

ప్రభుత్వం నడుం కట్టి బాధ్యతగా చేయవలసిన మరో పని - ప్లాస్టిక్ కవర్ల నిషేధం లేదా నియంత్రణ.