Sunday, December 21, 2014

మిగులు సిద్ధాంతం


మనిషి కడుపు నింపుకోవడానికే అతని సమయం మొత్తం వినియోగమయిపోతే బాగుండిపోయేది. నాగరికత పెరిగి టెక్నాలజీ వచ్చి అతను భుక్తి కొరకు అతి కొద్ది సమయం మాత్రమే కష్టపడితే సరిపోయే స్థితి వచ్చింది. సరే పాపం బిడ్డడు సుఖపడిపోతే పోనీ. కానీ ఆ మిగిలిన సమయాన్ని అతను దేనికి ఉపయోగిస్తున్నాడు?

మిగులు సమయంలో ఊరకే తిని పండుకొంటే భూమికి చాలా మంచిది. అతను ఏదో పొడిచేద్దామని, ఇరగదీద్దామని బయలు దేరినాడంటే దేన్నో నాశనం చేయడానికేనన్నమాటే.

నిన్న లింగ సినిమా చూశాను. హీరో అంటాడు - తాను భూమిమీద పుట్టినందుకు గుర్తుగా ఏదైనా సాధించి మిగిల్చి పోవాలని. పుట్టి పోయిన వాళ్ళందరూ తమ ఆరడుగుల సమాధి నిర్మించి పోయినా ఇప్పటికి భూమి మీద జాగా మిగిలేది కాదు. ఇరగదీసి ప్యాలెస్‌లు  కట్టుకోవడానికి మనిషికి జాగా ఎక్కడిది? బువ్వెక్కణ్ణుంచొస్తది?


జిడ్డు కృష్ణమూర్తి శిష్యులకు చేసిన చివరి విన్నపం ఏమిటంటే తనపేరున ఎలాంటి స్మారకాల్ని నిర్మించొద్దని.  సద్గురు జగ్గీ వాసుదేవ్ అంటాడు.  ఏదో సాధిద్దామని బయలుదేరే వారే భూమికి భారమని.

అర్ధం ఏమిటంటే అతి తక్కువ వనరులను ఉపయోగిస్తూ జీవించడమే ఆదర్శనీయమని. ఆలోచనల్లో వ్యవస్థలో సాధించాల్సింది సాధిస్తే సరిపోతుంది.

Thursday, November 13, 2014

చెంచా చాయ్ ఛే రూపాయ్


మంచి చాయ్ ఎక్కడ దొరుకుతుందా అని వెతికి వెతికి పట్టుకుంటామా వాడు కప్పు అని చెప్పి చెంచాడు చాయ్ నే పోస్తుండు. కప్పులు రోజు రోజుకీ సైజు తగ్గిపోయి చెంచా స్థాయికి చేరుకొన్నాయి. ఒక్క గుటకే అవుతుంది. హరే! స్పెషల్ చాయ్ అని చెప్పినా అంతే పోయబట్టిరి. పది రూపాయలంట.

చిన్నప్పుడు వన్ బై టూ చాయ్ తాగే వాళ్ళం. ఇప్పుడు టూ బై వన్ తాగే రోజులొచ్చినయ్.  టూ బై వన్ చెప్పాలంటే సిగ్గాయె. టూ బై వన్ పోయడానికి వాడి దగ్గర ఇంకా ఏమైనా పెద్ద పాత్రలేమైనా ఉంటాయా? ఊహు. రోజుకు పది చాయ్ లు తాగే వాళ్ళకు సరే. నాలాగ రెండే చాయ్ లు నియమంగా పెట్టుకొన్న వాళ్ళ పరిస్థితేమిటి?

కప్పు సైజుని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వాళ్ళు ఎంతగా నిర్ణయించారో? ఏమిటో? లాభంలేదు. డబ్బులు పెట్టినా సరిగ్గా చాయ్ తాగలేకపోతున్నందుకు తూనికలు కొలతల శాఖ వాళ్ళకి చెప్పాల్సిందే.    

Sunday, November 9, 2014

డిస్పోజబుల్ భారత్

స్వచ్చ భారత్ అభియాన్ తరుణంలో మనం డిస్పోజబుల్స్ వాడే విషయాన్ని ఒకసారి ఆలోచించాలి. రీ యూజ్ చేసే అవకాశం, సందర్భాల్లో కూడా డిస్పోజబుల్స్ వాడడం బాధ కలిగించే అంశం. ఇంట్లో అతిధులొస్తే కూడా కడగడం తప్పుతుందని డిస్పోజబుల్స్ వాడడం ఏం పద్దతి. ఏదో బయటకు వెళ్ళినప్పుడంటే అర్ధం చేసుకోవచ్చు.

ఇంకా ఘోరమైన విషయం ఏమిటంటే హోటళ్ళలో డిస్పోజబుల్స్ వాడడం.  పూర్తి ఎస్టాబ్లిష్ మెంట్ నీళ్ళు, పళ్ళాలు, గ్లాసులు, కడగడానికి కావలసిన నీటి వసతితో  పెట్టవలసిన బిజినెస్ ని డిస్పోజబుల్స్ తో లాగించేస్తున్నారు.

ఈ డిస్పోజబుల్స్ అన్నీ డిగ్రేడబుల్ అయితే వదిలిపోవు. అన్నీ ప్లాస్టిక్ వేనాయె. ఎక్కడ చూసినా ఇవే.

ఇదో దురాచారం స్థాయికి పెరిగిపోయింది. స్వచ్చ భారత్ లో దీన్ని చర్చించాలి. 

Thursday, October 23, 2014

పత్తి పత్తి

ఎక్కడ చూసినా పత్తి పంటే. నేషనల్ హైవే వెంట నుండి మారుమూల చందంపేట లోపల పొగిళ్ళ దాకా పత్తి పంటే.     భూములన్నిటా  పత్తే పెడితే తిండి పండించడం ఎక్కడో? పత్తి ఎగుమతి చేసి తిండి గింజలు దిగుమతి చేసుకోవాలా?  గిరిజనుల సాంప్రదాయక ఆహారం జొన్న రొట్టె. చందంపేట మండలమైనా, దేవరకొండ మొత్తమైనా ఎక్కడా జొన్న చేను కనపడదు. మహారాష్ట్ర నుండి లారీల కొలది దిగుమతి చేసుకొంటారట .

ఎందుకు ఇంత పత్తి ? ఇన్ని బట్టలు కావాలా? వనరులను పొదుపుగా వాడుకోవాలి. పెట్టుబడులు లాభాలు నష్టాలు లెక్కలు ఎక్కువైపోయి ఆత్మహత్యలు.

పెసర చేలు కూడా కంటికి కనపడడం లేదు. ఏం తిని బతుకుదామో అర్ధం కాదు. ఆ పంట కొంత ఈ పంట కొంత ఇలా రకరకాల పంటలు వేస్తే ఎదో ఒక్కటైనా ఆదుకోక పోదు. వైవిధ్యం అవసరం. 

Wednesday, October 8, 2014

స్వచ్ఛ భారత్ తరుణం

ఎన్నో మార్పుల్ని, ఎంతో అభివృద్ధిని చూస్తున్న మనం పారిశుధ్యం  విషయంలో మార్పు కొరకు కృషి చేయాల్సిన తరుణం ఇదే. ప్రభుత్వం ఇచ్చిన పిలుపుకు స్పందిద్దాము.

గ్రామీణ మంచినీరు - పారిశుధ్య శాఖలోనే పనిచేస్తున్న నేను పథకము అమలు విషయంలో కొన్ని అనుభవాల్ని అందరితో పంచుకోదలచాను. మరుగుదొడ్డి కట్టుకోవడానికి ప్రభుత్వ సబ్సిడీ పంపిణి విషయమై విధానాలను మాటి మాటికి మార్చడం వలన పెద్ద గందరగోళం తయారౌతుంది. ఒక వేవ్ కి ఇంకో వేవ్ కి మధ్య కట్టుకొన్న వాళ్ళు అటూ ఇటూ కాక సబ్సిడి రాక పాత దొడ్డి చూపించి సబ్సిడీ ఇవ్వమంటారు. ఒక్కనికి పాతదానికి ఇస్తే అందరూ ఇంకోసారి తీసుకోవడానికి ఎగబడతారు. అమలు చేసే యంత్రాంగం ఈ నెత్తి నొప్పి, బ్లాక్ మెయిళ్ళు భరించ లేక చేతులెత్తేసి కాలం గడిపేస్తున్నారు. కాబట్టి చాలా పకడ్బందీ గా సంకల్ప శుద్ధితో, పూర్తిగా అయిపోయేదాకా వెంట పడితేనే ఫలితం ఉంటుంది.


పారిశుధ్య విద్య కుడా అవసరం. విద్యాలయాల్లో పారిశుధ్య పరిస్థితులు ఘోరం. దానికి అందరిదీ బాధ్యత. మొదలు దాన్ని మంజూరి చేసేప్పుడే సరిపోను నిధులు మంజూరి చేయక, చవకగా ఎలా కట్టాలో ముష్టి సలహాలు మోడల్స్ ఇచ్చి కట్టమంటారు.  చాలా గట్టిగా, ధృఢంగా కడితేనే మన వాళ్ళతో ఆగవు. సస్తాలో కట్టాలని చూస్తే అవి వెంటనే  మూలకు పడతాయి. వాటికి నీటి సరఫరా కావాలి. పాఠశాలకే బోరు మోటరు ఇస్తే కరెంటు బిల్లు, రిపేర్లతో హెడ్మాష్టర్లకు నెత్తి నొప్పి. స్వీపర్లకే జీతాలు ఇవ్వలేని పరిస్థితి.  గ్రామ పంచాయతీ నల్లాలో ఓట్లున్న వారికి, నోరున్న వారికే నీళ్ళు అందుతాయి.  అదీ ఏ రాత్రో, ఏ జామో.

పాడైన వాటిని తిరిగి శుభ్రం చేయించడానికి మనుషులు ఎవరూ దొరకరు.  ఎవరి పాఠశాలను వారే అక్కడి విద్యార్ధులు, ఉపాధ్యాయులు అందరూ వంతులు వేసుకొని శుభ్రం చేయాలి. ఈ విషయం ఇలా చెప్పిన అధికారిణి ని గత ప్రభుత్వం తప్పు పట్టి ఆ పోస్టు నుండి తప్పించినట్లు గుర్తు. ఈ విషయంలో స్పష్టత లేకుంటే ఎన్ని కట్టించినా నిష్ప్రయోజనమే.

స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, చోటా నాయకులకు కాట్రాక్టులు చేసుకోవడానికి ఊళ్ళల్లో సిమెంటు రోడ్లు బాగా ఉపకరిస్తాయి. టాయిలెట్లు పూర్తిగా కట్టుకొన్న ఊరికే సిమెంటు రోడ్లు మంజూరి చేసే నిబంధనని అమలు చేయడం కష్టమేమీ కాదు.  అసలు సి.సి. రోడ్లకు పెట్టిన పైసల్లో పావు వంతు టాయిలెట్లకు పెట్టినా  అన్నీ పూర్తి అయ్యి ఉండేవి.

ప్రభుత్వం నడుం కట్టి బాధ్యతగా చేయవలసిన మరో పని - ప్లాస్టిక్ కవర్ల నిషేధం లేదా నియంత్రణ.



Sunday, August 17, 2014

సర్వే - సర్వజన హితం

తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 19న  నిర్వహించ తలపెట్టిన సర్వే గురించిన చర్చ ఈ మధ్య ఎక్కువగా జరుగుతుంది. వ్వక్తుల స్వేచ్ఛకి ఏదో అయిపోతుందనే భయాలు కొందరు దురుద్దేశ పూర్వకంగానే ప్రచారం చేస్తున్నారు. ఈ భయాలు అర్ధరహిత మైనవి. ప్రభుత్వాల నుండి మంచి సేవలను ఆశించే వారెవరైనా దీన్ని వ్వతిరేకించడం తగదు.

బీద వారికి మాత్రమే ప్రభుత్వ సహాయం అందించడానికి ఇది పనికి వస్తుంది. బ్యాంకు అక్కౌంట్ల నెంబరు అడిగినంత మాత్రాన వ్యక్తుల ఆదాయమంతా కూడా తెలిసి పోడు. ఈ నెంబర్లు కావాలంటే, ఆ ఖాతాల్లో ఉన్న డబ్బు తెలుసుకోవాలనుకొంటే ప్రభుత్వము నేరుగా బ్యాంకులను సంప్రదించి కూడా తెలుసుకో వచ్చు. ప్రభుత్వాలు సరిగ్గా సేవలు అందించక పోతే డబ్బులు ఉంటే మాత్రం ఏమి ప్రయోజనం? కార్లు కొనగానే సారా? నడపడానికి మంచి రోడ్డు ఉండాలి కదా.

వ్యక్తుల ప్రాంతీయత గురించిన కాలమ్స్ ఏవీ ఈ సర్వే ఫారంలో లేవు. అందుకని ఏదో అయిపోతుందనే అపోహ అవసరం లేదు. కాబట్టి అందరూ దీనికి సహకరించాలి. ఇది ఆహ్వానించ దగినది. 

Friday, May 9, 2014

మన రాజకీయాలు తయారు చేస్తున్న అభివృద్ధి నమూనాకి ఉదాహరణలు.

అభివృద్ధో అభివృధ్ధి అని గోల పెడుతున్నాం కదా! యేమిటది అని యెవరినైనా చిన్న నాయకుడిని అడిగితే ఊళ్ళల్లో సి.సి. రోడ్లు వేయడం, స్కూలు బిల్డింగులు కట్టడం, ఓవర్ హెడ్ ట్యాంకులు కట్టడం. ఇలా నిర్మాణాల్ని చూపిస్తారు. అదే అభివృధ్ధి అని చెబుతారు. ఇన్ని లక్షలు, కోట్లు వెచ్చిస్తున్నాం అని లెక్కలు చెబుతారు.

ఈ నిర్మాణాలే నిజంగా అభివృధ్ధా?  నేనొక మండలాధ్యక్షునితో వారి గ్రామానికి వారి కారులో వెళ్ళాను. కష్టపడి ఊళ్ళో సిసి. రోడ్లు వేయించాడు. కారు వెళ్ళడానికి బాగానే ఉంది. కానీ  గ్రామ సమీపానికి రాగానే కారు అద్దాలు ఎత్తండి ఎత్తండి అని నాకు కంగారుగా చెప్పారు.  ఎందుకంటే ఊళ్ళో టాయిలెట్లు లేవు. బహిరంగ మల విసర్జనతో   కంపు వాసన రాకుండా ఉండడానికి అద్దాలు ఎత్తమని చెబుతున్నాడు.

గ్రామంలో నీటి సరఫరాకి మొదటగా నీరు బాగా ఊరే వనరు కావాలి. తర్వాత ఆ బోరు / బావి నుండి నీరు సరఫరా చేసే మోటర్లు, పైపులైన్లు, ట్యాంకులు వగైరాలు కావాలి. బోరు, దానికి విద్యుత్తు లైను, మోటారు, పైపులైన్లు ఈ క్రమంలో పూర్తి అయిన తర్వాతే ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మించాలి. కానీ ఓవర్ హెడ్ ట్యాంకు ఒక ప్రతీక. మేము ఓవర్ హెడ్ ట్యాంకు నిర్మించాము అని ఘనంగా చెప్పుకోవడానికి పనికి వస్తుంది.  ఓవర్ హెడ్ ట్యాంకులు నిర్మిస్తే లాభాలు కూడా బాగా ఉంటాయి కాబట్టి వనరు సరిగ్గా ఉన్నా లేకున్నా ఓవర్ హెడ్ ట్యాంకుల నిర్మాణాలకు డిమాండ్. దానితో ట్యాంకులు కనపడతాయి కానీ ఊళ్ళో నీళ్ళు దొరకవు.

గ్రామాల్లో పాఠశాల భవనాల నిర్మాణం కూడా అంతే. దానిలో బోధించే ఉపాధ్యాయులు సరిపడా ఉండాలి. వారి బోధన మీద నమ్మకం కలిగి తల్లిదండ్రులు తమ పిల్లలను ఆ పాఠశాలకు పంపాలి. వారికి చదువు అబ్బాలి. ఇదీ అసలు అభివృద్ధి క్రమము. కానీ మన రాజకీయాలు భవనాల నిర్మాణం చుట్టూ, దాని కాంట్రాక్ట్ చుట్టూ తిరుగుతుంటాయి. భవన నిర్మాణాన్ని అభివృధ్ధి ప్రతీకగా చూపుతుంటారు కానీ దానిలో పిల్లలే ఉండరు.

లాభాలొచ్చే నిర్మాణాలని అభివృధ్ధి  ప్రతీకలుగా చూపిస్తూ ఉంటుంది మన రాజకీయ అభివృధ్ధి నమూనా. దాని మాయలో అందరూ పడిపోతారు. పెద్ద పెద్ద నీటిపారుదల ప్రాజెక్టులు కూడా అంతే. బృహన్నిర్మాణాలన్నీ పెద్దోల్ల అభివృధ్ధి కొరకే. ప్రతీకలు చూపించి మోసపుచ్చుతున్నారు. ఆ స్పృహ జనాలకు కలిగించాలి. ఈ ప్రతీకల మీద ఎంతో ప్రజాధనం ఖర్చు అవుతుంది కానీ జీవన ప్రమాణాలు మెరుగు పడడం లేదు.

నిర్మాణాలు ప్రధానం కాదు. సి.సి. రోడ్డు కాదు ముందు కావలసింది. పారిశుధ్యానికి ముందు మరుగుదొడ్డి కావాలి. సి.సి.రోడ్లకు పెట్టిన ఖర్చుతో ఎప్పుడో అందరికి మరుగుదొడ్లు కట్టించగలిగే వాళ్ళం. మరుగుదొడ్లు ఎందుకు కట్టించడంలేదు అంటే, దానితో మధ్య వాళ్ళకి ఏమీ లాభాలు లేవు కనుక. ఏది ప్రధానమో ఈ గోలలో వినిపించడం లేదు.

నిర్మాణాలు కావాలి. కానీ అవి మాత్రమే సరిపోవు. వాటిని పనిచేయించే వ్యవస్థలు పటిష్టంగా ఉండాలి.  ఈ నిర్మాణాలకు నిధులు గుంజుకొచ్చేనాయకులే మనకి హీరోలుగా కనిపిస్తున్నారు, కానీ వ్యవస్థను సవ్యంగా పనిచేయించే శాసనాలను తయారు చేసే తెలివి, నిబద్దత  వారికి ఉందా లేదా అనేది చర్చనీయాంశం కాకుండా పోయింది.







Saturday, March 29, 2014

గుంజుకొచ్చేటోడే ఎమ్మెల్యే

మనకు మంచి ఎమ్మెల్యే యెవరయ్యా అంటే బాగా నిధులు గుంజుకొచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేటోడే. గంతనే. ఎమ్మెల్యే ఇంకేం జెయ్యాల? ఇదే అలవాటైపోయింది. అసలు మనము ఎమ్మెల్యేలని ఎందుకు ఎన్నుకొంటున్నామో మర్చిపోయినం.

బాగా అంటే బస్తాల కొద్దీ అన్నమాట. తీస్కరావాలె ఊళ్ళల్ల సి.సి. రోడ్లెయ్యాలె. టాయిలెట్లు లేకుంటెమాయె. ట్యాంకులు కట్టాలె. నీళ్ళు లేకుంటెమాయె.   నిధులు గుంజక రావడానికి ఆయన ఏ పాట్లైనా పడొచ్చు. ఆ గ్రూపు, ఈ గ్రూపు, వాణ్ణి బ్రతిమలాడి, వీణ్ణి బెదిరిచ్చి ఎట్లయితేనేమి గుంజక రావాలె. కుక్కల తీర్గ కొట్లాడాలె. గెల్వాలె.   ఇదీ జనంలో, సాధారణ కార్యకర్తల్లో ఉన్న అభిప్రాయం. లేకపోతే ఏం జేసిండయ్య అని శాపనార్ధాలు. 

వాళ్ళని విధాన సభకు విధానాల్ని రూపొందించే టందుకు పంపించిన సంగతే మర్చి పోతున్నం. వాళ్ళు అక్కడ సభలో కూర్చొని నిధులను మంజూరి చేయడానికి ప్రాతిపదికలు, ప్రాధాన్యాలను రూపొందించడానికి పంపించాం. అంతేగానీ కింద మీద బడి బస్తాలు నింపుకొని నియోజకవర్గానికి మోసుకొని రావడానికి కాదు. 

విధి విధానాలు పద్దతులు తయారు చేస్తే న్యాయంగా రావాల్సినవి వస్తాయి. తారతమ్యాలు ప్రాంతీయ బేధాలు ఉండవు. పెద్ద మంత్రి అయినాయిన అన్ని గుంజకపోంగ   చిన్న మంత్రిని అయిన నేనెందుకు గుంజక పోకూడదని తయారైనది. వాళ్ళు తయారు చేయాల్సిన ప్రాతిపదికలకు వాళ్ళే తూట్లు పొడుస్తారు. 

ఈ ప్రాతిపదికలు ప్రాధమ్యాలు గోంగూర కట్టలు అసలు తెలిసేది ఎందరికి. గెలిపించారు. వెళ్లారు. పార్టీలలో  పై వాళ్ళు ఏది చెబితే దానికి తలూపి బయటికి రావడమే మన వాళ్ళు చేస్తున్న పని. 

యెవడైనా పద్దతిగా ప్రాతిపదికలనే వెతుకుతూ కూర్చుంటాడో వాడొత్తి వాజెమ్మ అయిపోతాడు ఓటర్ల  దృష్టిలో.