Monday, February 23, 2009

ఆర్ధిక సంక్షోభంనుండి ఐ.టి. పరిశ్రమ బయటపడే మార్గం.

అమెరికాలో ఏర్పడిన ఆర్ధిక సంక్షోభం ప్రపంచ వ్యాప్తమై మన దేశం పైన కూడా పడింది. ఐ.టి. పరిశ్రమ మన దేశంలో 1992 నుండి చాలా మందికి ఉద్యోగావకాశాలు కల్పించింది. దానితో ఎంతో సంపద కూడా మన ఆర్ధిక వ్యవస్థలోకి వచ్చింది. ఇప్పుడు సంక్షోభం వచ్చి క్రొత్తగా చదువుకొనే వారు నిరుద్యోగులయ్యే ప్రమాదం కనిపిస్తుంది.

తొంభయ్యవ దశకంనుండి కనీసం కొంత మందికైనా ఉద్యోగాలు దొరికాయంటే అది ఆర్ధిక సరళీకరణ, ప్రపంచీకరణ పుణ్యమే. లేకుంటే మనదేశంలో చదువుకొన్న నిరుద్యోగుల వలన ఎప్పుడో సంక్షోభం వచ్చి ఉండేది. ఆ సంక్షోభంలోనుండి గుణపాఠాలు నేర్చుకొని వ్యవస్థ సరయ్యే అవకాశం కూడా ఉండేదేమో. అదివేరే సంగతి. సాధారణంగానైతే సంక్షోభాలను సాధ్యమైనంతవరకు రాకుండా చూసుకోవాలి. ఒకవేళ తప్పనట్లయితే దానినుండి గుణ పాఠాలు నేర్చుకోవాలి. సరైన గుణపాఠాలు నేర్చుకొని కొత్తపద్దతుల్లో ముందుకెళితే సంక్షోభంతో కూడా వ్యవస్థకు మేలు జరుగుతుంది.

ఇప్పుడు ఈ సంక్షోభ సమయాన మనం నేర్చుకోవాల్సిన గుణపాఠం:
1. ఐటి పేరు మీద మనదేశంలో, బయటిదేశాల్లో మనవాళ్ళు చేసే పని మనది కాదు.
2. జీతభత్యాలు పెరగడం మాత్రమే అభివృద్ది కాదు. ఉదాహరణకు మనం కార్లు కొనగలుగుతున్నాము కానీ రోడ్లు లేవు. గేటెడ్ కమ్యూనిటీస్, స్పెషల్ ఎకనామిక్ జోన్లు అభివృద్దికి సూచికలుగా కాకుండా అంతరాలను సూచిస్తాయి.

ఇప్పటిదాకా బయటిదేశాలకు పనిచేసిన మన మానవవనరులను మనదేశానికొరకు పనిచేయించే ప్రణాళికలు తయారుచేయాలి. మన ప్రభుత్వం తన పరిపాలనకవసరమైన కొత్త ఐటి ప్రాజెక్టులను చేపట్టడం ద్వారా నిరుద్యోగిత పెరగకుండా చూడాలి. ఆ అవసరం మనదేశంలో చాలా ఉంది. యెవడో ప్రపంచ బ్యాంకు వాడొచ్చి మీ ఫలానా డిపార్టుమెంటు ఆధునికీకరణకు అప్పులిస్తామని మన నాయకులను టెంప్ట్ చేసేదాకా మన వాళ్ళు కదలరు. ఆ ప్రపంచ బ్యాంకు ఏజంట్లేమో ఎలాగూ కమీషన్లకొరకు అంచనాలను ఎక్కువగా చేసి చూపిస్తారు. మనం భరించలేని ప్రొప్రయిటరీ ప్రొడక్స్‌ని అంటగడతారు. ఇతర ఏదేశాల కంపెనీలు మన ప్రాజెక్టులను చేపట్టినా అదే విధంగా ఖరీదు ఎక్కువే అవుతుంది.

అందుకని ఓపెన్ సోర్స్ సాఫ్ట్‌వేర్లను ఇంకా అభివృద్ది పరచి తక్కువ ఖర్చుతో మన ప్రభుత్వ యాజమాన్య సాఫ్ట్‌వేర్స్ అభివృద్ది చేయాలి. అభివృద్ధి చెందిన దేశాల బడ్జెట్‌తో పోలిస్తే మనదేశ బడ్జెట్లు, ఆర్ధిక వనరులు తక్కువగానే ఉంటాయి. ఈ తక్కువ బడ్జెట్లతోనే మనకు కావలసిన కీలక, ప్రాధాన్యతా రంగాలను మొదలు ఐటిని ఉపయోగించి ఆధునికీకరించాలి. బహుళార్ధసాధక గుర్తింపు కార్డుల ప్రాజెక్టులు, భూ యాజమాన్య ప్రాజెక్టులను మొదలు చేపట్టాలి. తర్వాత సంక్షేమ పథకాల ప్రాజెక్టులను చేపట్టాలి. ఆర్ధిక, బ్యాంకింగ్ రంగం ఇప్పటికే ఐటిని ఉపయోగించి ఆధునికీకరణం చెందుతున్నాయి.

తక్కువ బడ్జెట్లతో ప్రాజెక్టులు చేయడానికి దేశీయ కంపెనీలు మొదలు ముందుకు రావు. కానీ ఇప్పుడు అవి సంక్షోభంలో ఉన్నాయి కాబట్టి గత్యంతరం లేక తప్పకుండా ముందుకు వస్తాయి. అవి వాటి ఉద్యోగులను ఒక మాదిరి వేతనాలకు ( భారీ మొత్తాలు కాకుండా ) పనిచేయించుకోవచ్చు కూడా. దాని వలన కొన్ని లాభాలు కూడా ఉన్నాయి. సమాజంలో అంతరాలు ఎక్కువకాకుండా కూడా ఉంటుంది.

ఇంకో అవకాశమేమంటే ప్రైవేటు కంపెనీలకు ప్రాజెక్టులను అప్పగించకుండా ప్రభుత్వ యాజమాన్యంలోని NIC లాంటి సంస్థలను భారీగా విస్తరించి ప్రభుత్వమే తనకు కావలసిన ప్రాజెక్టులను తయారు చేసుకోవచ్చు. తద్వారా చాలా మందికి కొత్తగా ఉద్యోగాలు కల్పించ వచ్చు. ఐటిని ఉపయోగించి వ్యవస్థను సక్రమంగా, పారదర్శకంగా నిర్మించుకో వచ్చు.

మరి మన నాయకమ్మణ్యలు ఇవన్నీ చేస్తారా? ఊహూః చేయనే చేయరు. మరి ఎలా?

ఎలాగంటే ఉద్యోగాలు కావల్సిన వారే ఈ డిమాండ్‌ని మొదలు పెట్టాలి. అదొక్కటే మార్గం.

6 comments:

  1. మంచి సూచన.అందరూ ఆలోచించాల్సిన విషయం.అందరి అభిప్రాయాలను కూడగట్టి మనకేది మంచిదో మనం అందరం ఆలోచించుకోవాలి.

    ReplyDelete
  2. మనకున్న వనరులలో మానవవనరులు చాలా ముఖ్యమైనవని వాటిని ఉపయోగించుకొనాలనె దార్శనికత ఉన్న నాయకత్వం లేదు.

    మీరన్నట్లు ఐ.టి. ఉపయోగించుకొని సరిదిద్దుకొనే వ్యవహారాలు చాలా ఉన్నాయి. వాటిలొ భూమికి సంబంధించిన రికార్డులు చాలా ముఖ్యమైనవి.

    ప్రాధాన్యతలే అస్తవ్యస్తంగా ఉన్నవి.

    మనకు సంబందించి మన పరిస్థితులకు అవసరమయ్యె రంగాలలో మానవవనరులను మళ్లించి పరిశొధణ ప్రయోగాలు చేయవచ్చు. అద్భుతాలు చేయవచ్చు.

    ఉత్పత్తి, సేవలు, మార్కెట్ అన్నిటికి అనుకూలమైన ప్రపంచం మనదేశం. వేరే దేశాల ప్రమేయం, అవసరం లేకుండ అభివృద్ది చెందగల పరిస్థితులు మనకు పుష్కలం.

    ఉదాహరనకు ఎలెక్ట్రిక్ స్కూటర్లకు మన దేశం పెద్ద మార్కెట్.ఈపాతికి ఉత్పత్తి, మార్కెట్ చాలా ఉండాల్సి ఉండె.

    ReplyDelete
  3. చక్కగా చెప్పారు. ఎవడో ఇచ్చే డబ్బులతో, వాడు చెప్పిన ఉత్పత్తులు కొని వాడికి వ్యాపారం చేసి పెట్టటమే మన వాళ్ళకు తెలిసిన అభివృద్ధి. ఈ మధ్యే మన రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల్లో స్కూల్ పిల్లలకు నేర్పే సాఫ్ట్వేర్ తయారు చేసే పనిని బోలెడు డబ్బులు పోసి మైక్రోసాఫ్ట్ కి అప్పగించింది. మన మార్కెట్లని మనమే వాడుకునే స్థితికి ఎప్పటికి వస్తామో ఏంటో.

    ReplyDelete
  4. వేదుల బాలకృష్ణమూర్తి, సమతలం, చైతన్య కృష్ణ గార్లకు ధన్యవాదములు.

    ReplyDelete
  5. manchi subject touch chesaru, marinthaga vishleshithe baguntundhi

    ReplyDelete
  6. విజయ్ కుమార్ గారికి ధన్యవాదములు. ఈ పోస్టులోని
    ఆ అవసరం మనదేశంలో చాలా ఉంది
    అనే లింకును ఓపెన్ చేయండి. మరిన్ని వివరాలు ఉన్నాయి.ప్రజాపాలనలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజి అనే ఒక పూర్తి స్థాయి పుస్తకము కూడా రాశాను. వీలైతే చదవగలరు.



    ఈ రోజు బిజెపి తన ఐటి విజన్ మ్యానిఫెస్టోని విడుదల చేసింది. చాలా మంచి విషయాలు దానిలో చేర్చారు.

    ReplyDelete