Friday, October 10, 2008

ప్రజాపాలనలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ


ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పేరు వినగానే మనకు స్ఫురించేది హైటెక్ సిటీ, లక్షల్లో జీతాలు, పెరుగుతున్న ఉద్యోగావకాశాలు మరియు కోట్ల రూపాయిల ఖరీదైన నివాసభవనాలతో కూడిన తళతళలాడే సంస్క­­ృతి. కొద్ది మంది అనుభవిస్తున్న ఈ మెరుగుల సంస్క­­ృతి ప్రక్కన్నే ముసురుకొన్న పేదరికం, అవిద్య, అనారోగ్యం, మురికి, దోపిడి, అస్తవ్యస్థత మనదేశంలో ఒక పెద్ద అంతరంగా ఇంకా కొనసాగుతూనే ఉంది. ఐటి పరిశ్రమ మన ఆర్ధిక వ్యవస్థలోకి అపార సంపదను తీసుకువచ్చింది. దానితో ఉద్యోగావకాశాలు పెరిగాయి. విదేశీ మారక ద్రవ్యం లభించింది. కొంత అభివృద్ధి జరుగుతున్నప్పటికీ దానితో పాటుగా సమాజంలో ఆర్ధిక అంతరాలు పెరిగాయి. సామాన్య మానవులకు అందని రీతిలో భూములు, ఇళ్ళు, స్థలాల రేట్లు పెరిగిపోయాయి. ఇంకా రకరకాల వైరుధ్యాలు ఏర్పడ్డాయి. దానిలో మొదటి అపసవ్యత ఏమిటంటే మన మానవవనరులు మన పని కాకుండా వేరే దేశాలకు పని చేయడం..


మనదేశపు ఐటి కంపెనీలలో జరుగుతున్న పనిలో 90% విదేశాలకు చెందినదే. మన యువతరం ఐటి కంపెనీలలో చేరి విదేశీ సామాజిక, ఆర్ధిక, వ్యాపార సంస్థలను సక్రమంగా, గాడితప్పకుండా నడిపించే పనిని చేస్తున్నారు. ఆయా దేశాలు, కంపెనీలు ఐటి మీద ఇంత పెట్టుబడి ఎందుకు పెడుతున్నాయో మనం ఒక్కసారి ఆలోచించాలి. ఎందువల్లనంటే ఐటి వినియోగం మూలాన వలన ఆయా సంస్థల నిర్వహణ తేలికవుతుంది. సంస్థల నిర్మాణము బలపడుతుంది, పనితనం, వ్యవహార దక్షత పెరుగుతుంది. అంతేకాకుండా ఆయా వ్యవస్థలలో క్రమత, పద్దతి, స్పష్టతలు పెరిగి గుణాత్మకమైన మార్పు, పెరుగుదల సంభవిస్తుంది.


ఇక్కడే మనం జాగ్రత్తగా ఆలోచించాలి. ఇది యాంత్రికమైన వెసులుబాటు మాత్రమే కాదు. అస్తవ్యస్తంగా ఉన్న మన ప్రభుత్వ పరిపాలనా వ్యవస్థను కూడా ఈ సుగుణాన్ని ఉపయోగించి పద్దతిగా, సక్రమంగా, వేగంగా, గాడితప్పకుండా నడిపించ గలిగే అవకాశం ఉంది. మన దేశ మానవ వనరుల్ని మనం మన వ్యవస్థని సక్రమం చేసుకోవడానికి వినియోగించుకోక పోవడాన్ని చరిత్ర క్షమించదు. ఆ అవసరం, అగత్యం మరియు అవకాశాలు కూడా ఈ రోజు మిగతా ప్రపంచంతో పోల్చి చూస్తే మనకే ఎక్కువగా ఉన్నాయి.



మన దేశంలో అవ్యవస్థకు ఎన్నో ఉదాహరణలు చెప్పవచ్చు. నల్ల ధనం, లంచగొండి తనం, పైరవీలు, రాజకీయ జోక్యాలతో మన వ్యవస్థ కుంటిదైపోయింది. ఇవి లేకుండా న్యాయం జరుగుతుందన్న నమ్మకం పోయింది. పద్దతి ప్రకారం క్యూలో వెళితే పని అవుతుందంటే వ్యవస్థలో ఎవరూ ఎగబడరు, తెగబడరు. ఒక్కరిద్దరు పద్దతి తప్పితే అందరూ గత్యంతరం లేక అదే మార్గంలో వెళ్ళాల్సి వస్తుంది. పద్దతి ప్రకారంగా క్రమం తప్పకుండా పనిచేసే వ్యవస్థ కావాలి. దానికొరకు అవసరమైతే కొత్తగా కనుగొన్న టెక్నాలజీని ఉపయోగించుకోవాలి.



సాంప్రదాయిక విలువలతో ఉద్యోగస్తులు, పౌరులు అందరూ తమతమ బాధ్యతని గుర్తెరిగి నీతిగా పనిచేసి, వ్యవస్థని సక్రమంగా నడిపించాలని అందరం అనుకొంటాం. కానీ టెక్నాలజీ పెరుగుతున్నా కొలదీ మారుతున్న ఉత్పత్తి సంబంధాలు మారుతుంటాయి. సంస్క­­ృతి మారుతుంది. ఉత్పత్తి సంబంధాలు మారినప్పుడు సామాజిక విలువలు కూడా నూతన సందర్భానికనుగుణంగా సమాజపు సంక్షేమం దిశగా వెంటనే మార్పుచెందాలి. కానీ సామాజిక పరిణామ వేగం, టెక్నాలజీ పరిణామ వేగం కంటె వెనుకబడి పోవడం మూలాన సమాజంలో విలువల సంక్షోభం ఏర్పడింది. దాని వలన నైతిక విలువల ఆధారిత పాత వ్యవస్థ అస్తవ్యస్థంగా తయారైనది. సామాజిక పరిణామ క్రమంలో విలువల ఆధారిత వ్యవస్థ సక్రమంగా తయారు కావడానికి సమయం పడుతుండవచ్చు. అలా జరగాలని మన ఆకాంక్ష. అది పూర్తిగా మన చేతిలో లేదు. ఆలోపు జరిగే చెడుపు జరగక ఆగదు. ప్రస్తుత సమాజపు పోకడలు గమనిస్తే కాలంతో పాటుగా ఇంకా స్వార్ధం, దోపిడీలు ఎక్కువౌతున్నట్లుగా కనపడుతుందే గానీ తక్కువౌతున్నట్లుగా కనపడడం లేదు. కాబట్టి వ్యవస్థని కాలానికి, పరిణామానికే వదిలి వేయడం కాకుండా ఇంకేమైనా చేయగలమా అని ఆలోచించాలి, వెతకాలి. దానికి సమాధానమే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ.


మన ప్రభుత్వాలు ఇ-గవర్నమెంటు కార్యక్రమాలను కోట్ల రూపాయిల వ్యయంతో మొదలు పెట్టాయి. ఉదాహరణకు మన కేంద్ర ప్రభుత్వపు నేషనల్ ఇ-గవర్నమెంటే యాక్షన్ ప్లాన్ కింద 25000 కోట్ల రూపాయిలు ఈ ప్రణాళికా కాలంలో ఖర్చుపెట్టడానికి సంకల్పించారు. 25000 కోట్లంటే చిన్నవిషయం కాదు కదా. అదంతా ప్రభుత్వాలు తమ సౌకర్యం కొరకే చేసుకొంటున్నట్లుగా సామాన్య ప్రజలు అనుకొంటున్నారు. ప్రభుత్వ కార్యాలయాలకి కంప్యూటర్లు కొంటున్నారు, ఆప్టికల్ ఫైబర్ కేబుల్ లైన్లు వేస్తున్నారు. కానీ ప్రయోజనం సామాన్య పౌరుడు గుర్తించగలిగిన స్థాయిలో లేదు. ఎవరి ఇంటిముందరి నుండైతే ఆ కేబుల్స్ వేశారో కనీసం వారి జీవితాల సమాచారం కూడా ప్రభుత్వానికి తెలియదు. ప్రజాపాలనలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ఉపయోగించడం వలన కలిగే మేలు, అది తీసుకు రాగలిగే మంచి మార్పు, సక్రమ మైన వ్యవస్థ మొదలైన విషయాలు సామాన్య పౌరులకి తెలిసినప్పుడే ప్రభుత్వం తాను ఆ పేరన పెట్టే ఖర్చు సరైన విధంగా పెట్టడం, దానికి అవసరమైన ప్రాధాన్యతనివ్వడం జరుగుతుంది. ప్రజలకు ఏమీ తెలియకుండా ఉంటే అదంతా టెక్నికల్ వ్యవహారమనీ ఎవ్వరూ పట్టించుకోరు. దాని వలన కలిగే మేలు తెలియదు. అది జరుగదు. ప్రాధమిక వాస్తవం అయినటువంటి సమాచారానికి జీవితానికి ఉన్న సంబంధం ఏమిటి? ప్రభుత్వ నిర్వహణలో సమాచార సక్రమ యాజమాన్యం, వినియోగం ప్రజల జీవితాల్లో ఏ విధంగా మార్పు తేగలదో తెలుసుకోవాలి. ప్రజాపాలనలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ఉపయోగపు విలువ, పద్దతి, అవసరం, అగత్యం, సందర్భాలని మనందరం అర్ధం చేసుకోవాలి.


సమాచారాన్ని మనం ఈ విధంగా నిర్వచించుకోవచ్చు. ఏదైనా ఒక అస్థిత్వపు నగ్న వాస్తవికతను వాఖ్యానించడానికి, ఒక మాధ్యమం మీద నమోదుచేయడానికి, ఇతరులకు తెలియజెప్పడానికి వీలుగా దానికి భాష, సంకేత, లిపి, సంఖ్య, చిత్ర, ధ్వని రూపమివ్వడం.అస్థిత్వమంటే ఉదాహరణకు మనుషులు, భూమి, ఇల్లు, డబ్బు, వస్తువాహనాలు, కాలము మొదలైనవి. ఒక అస్థిత్వపు నగ్న వాస్తవికత అంటే దానికి సంబంధించిన ప్రాధమిక, ఇంద్రియగోచర విషయం. ఉన్నదానిని నేరుగా తెలుసుకోవడమన్న మాట. వాస్తవాన్ని వాఖ్యానించడం, నమోదు చేయడం అని కూడా అనుకోవచ్చు. ఉన్నదాన్ని ఉన్నట్లుగా చెప్పడం అంటే సత్యాన్ని చెప్పడమే. ఉన్నది లేనట్లుగా చెప్పడం, లేనిది ఉన్నట్లుగా చెప్పడమే అసత్యం లేదా అబద్దం అంటాము. వాస్తవంతో అంగీకరించే ప్రక్రియనే మనం సత్యం అని చెబుతాము. వాస్తవం అనేది వ్యాఖ్యానించబడే వస్తువుకు సంబంధించినది. అంగీకారము, సత్యము అనేవి తెలుసుకొనే వ్యక్తికి సంబంధించినవి. కాబట్టి మనం సరైన సమాచారాన్ని తెలుసుకొనే ప్రక్రియని సత్యాన్ని తెలుసుకోవడం అని కూడా చెప్పవచ్చు. ఆ విధంగా సమాచారానికి, ప్రాధమికి సత్యానికి సంబంధం ఉంటుంది. సమాచారాన్ని తెలుసుకొనే క్రమంలో, సందర్భంలో మాత్రమే దానికి విలువ ఏర్పడుతుంది. అవసరం లేనప్పుడు సమాచారం మనకు నాన్సెన్స్‌గా, న్యూసెన్స్‌గా, గందరగోళంగా కూడా కనపడుతుంది. వ్యక్తిగత స్థాయిలో జ్ఞానసముపార్జనకు, కార్యనిర్వహణకు ఇంద్రియస్ప్రుహ ఏవిధంగానైతే ఉపయోగపడుతుందో అదేవిధంగా వ్యవస్థ స్థాయిలో విధానాల రూపకల్పనకు, పథకాల అమలుకు సమాచారం ఉపయోగపడుతుంది.



మన ప్రభుత్వకార్యాలయాల్లో ఇటీవలికాలంలో కంప్యూటర్ల వినియోగం పెరిగింది. కానీ వాటితో సాధారణ టైప్‌మిషన్ కంటే కొద్దిగా ఎక్కువ ప్రయోజనాన్ని మాత్రమే పొందుతున్నారు. వాటిలో 90% మేరకు సమాచారపు సమగ్రతకు ఏ విధమైన హామీ లేని అప్లికేషన్లను మాత్రమే వాడుతున్నారు. ప్రణాళికాబద్దమైన డేటాబేస్‌లు, సాఫ్ట్‌వేర్లని ఇంకా ఉపయోగించడం లేదు. మామూలు మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ లాంటి అప్లికేషన్లను చూసి ఇంతే అనుకొంటాము. వీటిల్లో సమాచార సమగ్రతకు ఏ విధమైన పూచీ ఉండదు. కానీ ఒరాకిల్, సైబేస్, ఎస్‌క్యూయల్ సర్వర్, మెయిన్ ఫ్రేమ్స్ లాంటి రిలేషనల్ డేటాబేస్ మేనేజ్‌మెంట్ సిస్టం మోడల్స్‌ని ఉపయోగించడం వలన సమాచారం సమగ్రంగా ఉంచవచ్చు, వ్యవహారాల్ని సక్రమంగా నడిచేట్టు చేయవచ్చు. తప్పుడు వ్యవహారాల్ని నిరోధించవచ్చు. ప్రణాళికాబద్దమైన డేటాబేస్‌లో ఏ చెత్తపడితే ఆ చెత్తని నింపితే ఊరుకోదు. రిజెక్ట్ చేస్తుంది. డేటాని పలు రకాలైన సమగ్రతా పరీక్షలు జరిపిన తర్వాత మాత్రమే నమోదును అనుమతిస్తుంది. డేటాబేస్‌లకి ప్రవేశయోగ్యతలు అంచెలంచెలుగా ఉంటాయి. ఎవరు పడితే వారు ఇష్టం వచ్చిన విధంగా మార్పుచేయడానికి వీలు ఉండదు. సాఫ్ట్‌వేర్ ప్రోగ్రాం చేసే వారికీ, ఉపయోగించే వారికి సంబంధం ఉండదు కాబట్టి రూల్స్‌ని అతిక్రమించే అవకాశం ఉండదు.



ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని మన వాడే పదానికి పరిమిత అర్ధ మాత్రమే ఉన్నది. నిజానికి దానిని పూర్తి రూపంలో ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్ టెక్నాలజీ అని వాడాలి. ప్రసార సామర్ధ్యం వలన సమాచార సాంకేతిక పరిజ్ఙానపు ప్రయోజనాలు విస్త­­ృతమయినాయి. టెక్నాలజీ వినియోగంతో సాంప్రదాయ పరిపాలనా వ్యవస్థలోని అనేక పరిమితులను అధిగమించ వచ్చు. దాని వలన జరిగే మేలు అదే. ఉదాహరణకు మన ప్రభుత్వ వ్యవహారాలని సంవత్సరానికొకసారి ఆడిట్ జరుపుతారు. కానీ కంప్యూటర్లు ఉపయోగించినప్పుడు అవి ప్రతీ క్షణం, నిరంతరం లెక్కలు సరి చూస్తూనే ఉంటాయి. లెక్కలు సరిగ్గా నిబంధనలప్రకారం ఉంటేనే వ్యవహారాన్ని అనుమతిస్తాయి. అంటే కాల పరిమితిని అధిగమించినట్లు.




అలాగే ఒక వ్యవహారాన్ని ఆమోదించడానికి వేరే ఎక్కడో దూరాలలో ఉన్న కార్యాలయాలు నిర్వహించే ప్రామాణిక సమాచారంతో పోల్చి చూడాల్సి వస్తుంది. సాధారణంగా ఆ సమాచార ధృవీకరణ పత్రాలను తెమ్మని పౌరులనే కోరతారు. దానికొరకు పౌరులు పడరాని తిప్పలు పడతారు. నెట్ వర్క్‌డ్ కంప్యూటర్ల ద్వారా ఎక్కడో దూరాలలో ఉన్న వేరే కార్యాలయాలు నిర్వహించే సమాచారాన్ని ఉన్నచోటికి తక్షణం రప్పించుకొని వ్యవహారాలని వెంటనే జరిగేట్లుగా చేయవచ్చు. ఇది దూరాల్ని అధిగమించడమన్నమాట.



కంప్యూటర్లతో అపారమైన, వేగవంతమైన, ఖచ్చితమైన గణన సామర్ధ్యం మనకు లభిస్తుంది. దానితో సమాచారాన్ని, సంఖ్యలని వేగంగా, ఖచ్చితంగా లెక్కించడం, ప్రాసెస్ చేయడం వీలవుతుంది. కంప్యూటర్లు అంకెల గణన మాత్రమే కాకుండా వివిధ అస్తిత్వాలని గుర్తించి వాటి మధ్యగల సంబంధాలను కూడా గణించి, కుదిర్చి, విశ్లేషించి, నిర్ధారించగలుగుతాయి. కంప్యూటర్ సహాయంతో వివిధ అస్థిత్వాల మధ్య సంబంధాల గణనం, వాటి మధ్య తార్కిక వ్యవహార ప్రక్రియలు ( లాజికల్ ఆపరేషన్స్ ) కూడా సాధ్యపడుతాయి. ఇది మానవ గణన సామర్ధాన్ని, ప్రాసెసింగ్ సామర్ధ్యాల పరిమితిని అధిగమించడం.



ఒక మాధ్యమంగా కాగితము జడమైనది. పరిమితమైనది. అధికారంలో ఉన్న వారి దయాదాక్షిణ్యాల మీదనే దాని మీద రాయబడిన సమాచారపు లభ్యత ఆధారపడి ఉంటుంది. రిజిస్టర్లలో రాసిన సమాచారాన్ని ఎవ్వరైనా బీరువాలో దాచి తాళం వేయాల్సిందే. కానీ డిజిటల్ రూపంలోకి మార్చబడిన ఏవిషయాన్నైనా కాంతి వేగంతో ప్రసారం చేసే వీలుంది. అందరికీ అన్ని చోట్లా తక్షణం కనపడే అవకాశం ఉంది. కంప్యూటర్ ఒక్క మాధ్యమం మాత్రమే కాదు. ఒక మాధ్యమం ఒక గణణ సాధనం, ఒక ప్రసార సాధనం. ఆ మూడింటి కన్వర్జన్సే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. విషయ ప్రమాణంగా కాగిత మాధ్యమం ఉన్నప్పుడు దానికి ఏ విధమైన కార్యకుశలత లేని కారణంగా దాని మీద రాసిన ఏ సమాచారమైనా దాని లాగే జడంగా ఉండిపోతుంది. కంప్యూటర్ మాధ్యమానికున్న కార్యనిర్వాహక సామర్ధ్యం వలన, ప్రసార సామర్ధ్యం వలన ఇతర ఎక్కడెక్కడో ఉన్న విషయాల గ్రహింపుతో వ్యవహారం నెఱుపగలుగుతుంది.

కంప్యూటర్ డేటాబేస్‌లలో నమోదు చేయబడిన సమాచారం సర్వర్లలో భద్రంగా ఉంటూనే బయటివారు ఎక్కడినుండైనా ఇంటర్‌నెట్‌లో చూడగలిగే సదుపాయం ఉంది. డేటాబేస్‌లోని సమాచారాన్ని చూడగల అవకాశాన్ని మాత్రమే ఇచ్చి దాన్ని మార్చగలిగే అవకాశం లేకుండా చేయవచ్చు. ఈ విధంగా పరిపాలనలో పారదర్శకతని సాధించడానికి కూడా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గొప్ప సాధనం అవుతుంది. అప్పుడు సమాచారహక్కు దబాయింపుగానో, దేబిరింపుగానో కాకుండా నిర్నిమిత్తంగా సాకారం పొందుతుంది.




ప్రణాళికాబద్దమైన, సమగ్రమైన సమాచారం అందుబాటులో ఉన్నప్పుడు ప్రభుత్వ వ్యవహారాలని ఆమోదించే ప్రక్రియని కంప్యూటర్లద్వారా ఆటోమేట్ చేయవచ్చు. దానిద్వారా అధికారుల నిర్ణయవిచక్షణను, పక్షపాతాలను బేరసారాలను నిరోధించవచ్చు. నిబంధనలకు తప్పుడు, అనుకూల అన్వయాలు కల్పించి అక్రమాలు జరిపే వారి పప్పులు ఉడకవు.




మన పరిపాలనలో ఎప్పుడు ఏ కొత్త పథకము వచ్చినా దాని అవసరాలమేరకు మాత్రమే సర్వేలు చేసి సమాచారాన్ని సేకరిస్తుంటారు. ఒకదానికి సర్వేచేసి సేకరించిన సమాచారం ఇంకో సందర్భానికి పనికి రాక క్షేత్రస్థాయి ఉద్యోగుల శక్తి, వనరులు వృధా అవుతున్నాయి. కానీ ఐటిని వినియోగించి ప్రణాళికాబద్దంగా, సమగ్రంగా సేకరించిన సమాచారాన్ని ఎన్నిసార్లైనా పునర్వినియోగానికి అవకాశం ఉంటుంది. కార్యాలయాల్లో సమాచార వినిమయ ప్రక్రియల్ని కంప్యూటర్లతో సాధించి పౌరులకు మెరుగైన సేవల్ని అందించొచ్చు. క్షేత్రస్థాయి ఉద్యోగుల పని భారాన్ని తగ్గుతుంది. గంపెడంత సమాచారం, నిర్వహణా పనిభారంతో పనిచేసే క్షేత్రస్థాయి ఉద్యోగులు తమపని భారంతోనే ఊసురోమంటూ ఉద్యోగాలని ఈడుస్తుంటారు. రకరకాల సర్వేలు, రికార్డులు, రిజిస్టర్లు, లిస్టులు, ఫారాలతో కుస్తీలు పడుతుంటారు. వారికి తమ కార్యాలయ అంతర్గత పని భారమే ఎక్కువై పౌరుల సమస్యలు సావధానంగా విని పరిష్కరించే స్థితిలో లేరు. విసుక్కుంటారు. తీరిక లేదంటారు . రూల్స్ అడ్డం ఉన్నాయని చెబుతారు. ఐటిని ఉపయోగించడ ద్వారా వారికి ప్రజలతో మమేకమై వారి సమస్యలు విని అర్ధం చేసుకొని పరిష్కరించే తీరిక, వెసులుబాటు కలుగుతుంది

మన ప్రభుత్వాల ఇ-గవర్నమెంటు ప్రణాళికలు ఏ శాఖకాశాఖ తమ పరిధిలో, తమకు మాత్రమే అవసరమైన సమాచార యాజమాన్య, వ్యవహార పద్దతుల్ని అభివృద్ధి చేస్తున్నారు. కానీ నిజానికి చాలా శాఖలకి ఇతర శాఖలతో వ్యక్తులు, వనరుల ద్వారా సంబంధం ఉంటుంది. ప్రతీ శాఖలో ఈ వ్యక్తులే కదా తారసపడేది. ఒక శాఖ సమాచారం ఇంకొక శాఖకి కావల్సినప్పుడు సర్టిఫికేట్ల ద్వారానో, ఉత్తర ప్రత్యుత్తరాల ద్వారానో తెప్పించు కొంటారు. అవి తెప్పించుకొని వ్యవహారం అమలు జరిగేటప్పటికి నెలలు, సంవత్సరాలు పడుతుంది. కాబట్టి అన్ని శాఖలకి సామాన్యమైన (కామన్) సమాచారాన్ని సమగ్రంగా సేకరించి డేటాబేస్ తయారు చేసుకోవాలి. ఉదాహరణకు పౌర సమాచారం, భూమి-స్తిరాస్థుల సమాచారం, వాహనాల సమాచారం, కంపెనీలు-సొసైటీల సమాచారం. ఆ సమాచారానికే ప్రామాణికత, మాన్యత కల్పించాలి. ఆ డేటాబేస్ లోని సమాచారం ఆధారంగా, దాన్ని సూచిస్తూ వ్యవహారాలు నడిచేటట్లుగా చట్టాలు మార్చుకోవాలి. పరిపాలనా ప్రక్రియల్ని పునర్మించాలి. సామాన్య ఉమ్మడి సమాచారంతో వివిధ శాఖల మధ్య సమన్వయం, శాఖాంతర సమాచార వినిమయం వీలవుతుంది. అవసరమైన మేరకు సంయుక్త కార్యనిర్వహణ కూడా వీలవుతుంది.





ఒకే పేర్లు గలవారు ఒకరి కంటే ఎక్కువ ఉండే అవకాశాలున్నాయి కాబట్టి గుర్తింపు కొరకు ప్రతీ వ్యక్తికీ నిర్దిష్టమైన, ఏకాంకితమైన నెంబరుని కేటాయించాలి. అన్ని ప్రభుత్వ వ్యవహారాల్లో అదే నెంబరుని ఉపయోగించాలి. ఒక వ్యక్తికి ఓటరులిస్టులో ఒక నెంబరు, బ్యాంకు ఆకౌంటుకి ఒక నెంబరు, డ్రైవింగ్ లైసెన్స్‌కి ఒక నెంబరు, పాస్ పోర్టుకి ఒక నెంబరు, పాన్ నెంబరని ఇంకొకటి ఇలా ఏ శాఖకాశాఖ తమ పరిధుల్లోనే గుర్తింపులని కేటాయించడం వలన ఏ శాఖలో జరిగిన వ్యవహారం ఆ శాఖకే పరిమితమై వ్యవహార సమగ్రత లేకుండా పోతుంది. అక్రమాలకు అనేక అవకాశాలు ఉన్నాయి. అన్నిశాఖలూ ఒకే రకమైన గుర్తింపు విధానాన్ని అనుసరించినప్పుడు వ్యవహార సమగ్రత చేకూరుతుంది. ఆయా వ్యక్తుల ఆదాయ వ్యయాలు, పన్ను చెల్లింపులు, నేరసమాచారం, సంక్షేమ లబ్ది మొత్తాలని సమగ్రంగా అర్ధం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది.



పౌరుడు అతనికి వ్యక్తిగతంగా, సామాజికంగా ఉపయోగ పడే అన్ని ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాలు, వాటి సమాచారం, లావాదేవీలని ప్రైవేటు ఇంటర్‌నెట్ కియోస్కుల ద్వారా చూడగలగాలి. సాధ్యమైనన్ని సరళమైన వ్యవహారాల్ని ప్రైవేట్ ఇంటర్ నెట్ కియోస్కుల ద్వారా జరగడానికి అనుమతించాలి. వివిధ ప్రభుత్వ సేవలకి దరఖాస్తులు ఆన్‌లైన్లో పెట్టుకోవడం, పెట్టుకొన్న దరఖాస్తులు ఏ స్థాయిలో ఉన్నాయో ఆన్‌లైన్లోనే తెలుసుకొనే సదుపాయం ఉండాలి.పౌరునికి ఒక పథకంలో ఒక సేవ మంజూరీ అయినప్పుడు ఆ సమాచారం కూడా కియోస్కులలో తెలుసుకోగలగాలి. ప్రతీ దానికి పౌరుడు ప్రభుత్వాధికారి దగ్గరికే వెళ్ళే అవసరం లేకుండా చేయాలి. ప్రభుత్వ కార్యాలయానికి తప్పనిసరైతే మాత్రమే పౌరుడు వెళ్ళాలి. ఇలా ఎక్కడో మండల కేంద్రములలోని కియోస్కులలో కాకుండా పౌరుడు తన గ్రామంలో సేవ పొందే అవకాశం ఉంటే మంచిదే. తన ఇంట్లోనే ఉండి చూసుకోగలిగితే ఇంకా మంచిది. కానీ మన దేశంలో ఉన్న మౌలిక పరిస్థితుల వలన, నిరక్షరాస్యత, భాషా సమస్యల కారణంగా మారు మూల గ్రామాలకి ఇంటర్‌నెట్ చేరుకోవడానికి ఇంకా సమయం పడుతుంది. ఈ లోపు మండల కేంద్రంలో లేదా పెద్ద, కూడలి గ్రామాల్లో ఈ సదుపాయాన్ని కల్పిస్తూ ఇ-గవర్నమెంటు ప్రోగ్రాములని డిజైన్ చేసుకోవాలి.





ఏ శాస్త్రంలోనైనా లేదా ఏ రంగంలోనైనా గణిత శాస్త్రవినియోగం మొదలైందంటే అది ఆ రంగంలో ఒక విప్లవాన్ని సృష్టిస్తుంది. గత ఐదారు శతాబ్దాలలో విజ్ఙాన శాస్త్రాల అభివృద్ది వెనుక ఉన్న కారణమిదే. గణితశాస్త్ర పద్దతి, క్రమత ఆయాశాస్త్రాలని ఉన్నతమైన, ఉత్క­­ృష్ట స్థాయికి తీసుకెళుతుంది. గణిత అన్వర్తన వలన ఆ శాస్త్రంలో, ఆ రంగంలో స్పష్టత, నిర్దిష్టతలు పెరుగుతాయి. తద్వారా క్రమంగా ఆ శాస్త్రం సత్యానికి చేరువౌతుంది. అది సత్యంగా పరిణమిస్తుంది. పరిపాలనలో ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీని ఉపయోగించడమంటే ప్రజలు, వనరులు, సంపదల మధ్యనున్న సంబంధాలలో గణిత శాస్త్ర క్రమత, పద్దతి, స్పష్టత, నిర్దిష్టతలను ఆవిష్కరించడమే. అప్పుడు వివిధ అస్తిత్వాల మధ్య చట్టాల్లో నిర్దేశించుకొన్నవిధంగా సంబంధాలుంటాయి. లావాదేవీలు ఖచ్చితత్వంతో అమలు అవుతాయి.

మన దేశంలోని ఇ-గవర్నమెంటు ప్రాజెక్టులలో అనుసంధానం, పరిపాలనా ప్రక్రియల పునర్నిర్మాణాలు పెద్ద సమస్యలుగా ఉన్నాయి . టెక్నాలజీది సమస్య కాదు. టెక్నాలజీ బాగా తెలిసిన వారికి పరిపాలన సరిగా తెలియక పోవడం, పరిపాలన తెలిసిన వారికి టెక్నాలజీ గురించి తెలియకపోవడం మన దగ్గర జరుగుతున్న విచిత్రం. ఈ ప్రాజెక్టుల రూపకల్పనలో పౌరునికి భాగస్వామ్యం పూర్తిగా లేక పోవడం కూడా ప్రాజెక్టులు విజయవంతం కాకపోవడానికి ఒక కారణం. చాలా ప్రాజెక్టులు ఒక్కరిద్దరు వ్యక్తుల కృషితో ఉత్సాహంతో రూపుదిద్దుకొని వారు ప్రక్కకు వెళ్ళగానే మూల పడుతున్నాయి. టెక్నాలజీని అందించే ప్రైవేటు సంస్థలు టెక్నాలజీకి అధిక ప్రాధాన్యతనిచ్చి అసలు పరిపాలనని మరుగున పడేస్తున్నాయి. ప్రైవేటు సంస్థ టెక్నాలజీని సప్లై చేసినంత వేగంగా పరిపాలనలోని పద్దతులు, సంక్లిష్టమైన నిబంధనలు మారవు. ప్రభుత్వాలు చట్టాల మార్పిడి ద్వారా ఆ పనిని చేసే వేగం చాలా తక్కువగా ఉంది. అందువలన మనదేశంలోని ప్రాజెక్టులు నత్త నడక నడుస్తున్నాయి.




ఏ ఇ-గవర్నమెంటు సంకల్పం సఫలీకృతం కావాలన్నా ఏదో కొద్ది కొద్దిగా చేసుకొంటూ వెళితే ఫలితాలు ఏమాత్రం కనపడవు. దాన్ని పూర్తి రాజకీయ సంకల్పం, టెక్నాలజీ, పెట్టుబడి, మౌలికవసతులు, వ్యవస్థాగత సంస్కరణలు మొదలైన అంశాలన్నిటితో సంపూర్ణంగా చేస్తేనే ఫలితం ఉంటుంది. ఏ ఒక్కటి సరిగా లేకున్నా పెట్టిన పెట్టుబడి వృధా అవుతుంది. ఇది కూడా అనేక మాయోపాయాల్లో ఒకటి అని ప్రజలకు నమ్మకంలేకుండా పోతుంది. ఇ-గవర్నమెంటు ప్రాజెక్టులు సఫలీకృతం కావాలంటే దానికి ఉపయోగించిన టెక్నాలజీ ఒక్కటే సరిపోదు. టెక్నాలజీ ప్రభావం 20% ఉంటే పరిపాలనా ప్రక్రియల పునర్నిర్మాణం 35%, ప్రభుత్వ సంకల్పం, చట్టాలు, పద్దతుల సంస్కరణలు 45% ప్రభావాన్ని చూపుతాయి.




చట్టాలలో, విధానాలలో లోపాలు ఉంటే ఐటిని ఉపయోగించి కూడా ప్రయోజనం ఉండదు. కానీ ఇప్పటికి ఉన్న చట్టాల అమలులో, ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణలో ఐటిని ఉపయోగించడం వలన కలిగే ప్రయోజనాలు మాత్రం కాదనలేనివి. మనకు మంచి చట్టాలకు కొదువలేదు. కనీసం మనకున్న చట్టాలు అమలుకు నోచుకోవడమైనా ఒక పెద్ద ముందడుగే అవుతుంది.




ఐటితో ప్రభుత్వాలు చూడగలిగే లెక్కల పరిధి పెరుగుతుంది. వనరులు, సంపద, డబ్బు, శ్రమ, కాలం వృధాగా లెక్కలేకుండా వినియోగంలోకి రాకుండా మరుగున పడిపోయే దురవస్థలోంచి బయట పడవచ్చు. అవి ఏ మూలలో, ఎంత కొద్ది మొత్తంలో ఉన్నప్పటికీ ప్రతిదీ లెక్కలోకి వచ్చి దాని స్వతఃసిద్ధమైన విలువను పొందుతుంది. సరైన ప్రణాళికతో నిర్మించే డేటాబేస్‌లతో వ్యక్తుల కదలికలని కనిపెట్టవచ్చు. తద్వారా నేరాలని కూడా అదుపుచేయవచ్చు.



సమాచారమైనా సత్యమైనా తెలియకుండా మరుగున పడి, మూయబడి ఉన్నంత కాలం దానికి విలువ చేకూరదు. అది జీవితంలో భాగం కాదు. అది దానిచుట్టూ ఉన్న పొరలు, మాయలు అన్నీ తొలగి బహిర్గతమైనప్పుడే విలువగా మారుతుంది. జీవితంలో భాగమౌతుంది. పారదర్శకత వలన పేదలు తమ వనరుల మీద హక్కులు కాపాడుకో గలుగుతారు. వారికి స్వావలంబన, స్వయం నిర్ణయాధికార శక్తి వస్తుంది.



కమ్యూనికేషన్ టెక్నాలజీ అంతిమ లక్ష్యము అందరినీ చేరడమే . అందరినీ చేరడమనే దాని లక్ష్యంలో అంతర్లీనంగా ఒక ప్రజాస్వామిక భావన ఉంది. ఇలాంటి టెక్నాలజీని ప్రజలపరం చేయకుండా కొన్ని వర్గాలే దాన్ని వినియోగించుకో గలగడం వలన అభివృద్ధి అసౌష్టవంగా తయారౌతుంది. ప్రభుత్వాలు ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్ టెక్నాలజీని ఉపయోగిస్తే పరిపాలన ప్రజలకు చేరువౌతుంది తద్వారా దానిలో ప్రజాస్వామికత కూడా పెరుగుతుంది. ఆర్ధిక అంతరాలని డిజిటల్ అంతరం ఇంకా ఎక్కువ చేస్తుంది. కాబట్టి పరిపాలనలో ఇ-గవర్నెన్స్‌ని ప్రవేశ పెట్టి అన్ని అంతరాలని తగ్గించాలి. దీని విలువని గుర్తించిన పరిపాలనా సంస్కరణల సంఘం ( అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమీషన్) ప్రభుత్వ పరిపాలనలో ఐటి వినియోగం పెంచాలని, అన్ని రకాల ప్రభుత్వ సేవలని ఆన్ లైన్‌లో అందించాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ప్రణాళికా సంఘం, రాష్ట్రాలు తమ ప్రణాళికా నిధులలో 3% ఈ దిశగా ఖర్చు చేయాలని నిబంధనలని విధించింది.





కంప్యూటర్లే మొత్తం పనిని చేస్తాయి, ఉద్యోగాలు పోతాయని గగ్గోలు పెట్టాల్సిన పని లేదు. అది లెక్కల్ని, వ్యవహారాల్ని మాత్రమే నడుపగలుగుతుంది. భౌతిక కార్యాలను, క్షేత్రస్థాయి పనుల్ని అది చేయలేదు.విషయ విశ్లేషణకు, వ్యవహారాల ఆమోదానికి ఇంతమంది, ఇన్ని అంచెలు అవసరం లేదు. విషయ సేకరణకు తగినంత మంది కావాలి. విషయ సేకరణ నమోదు అనేది ప్రజాస్వామ్యయుతంగా, ప్రజల భాగస్వామ్యంతో జరగాలి. కార్యాలయంలోపల జరిగే వ్యవహారం సాధ్యమైనంత మేరకు ఆటోమేట్ చేయాలి. ఉద్యోగులు క్షేత్రస్థాయిలో ప్రజలమధ్య పని చేయాలి. ప్రజలతో అరమరికలు లేకుండా కలిసిపోయి వారికి భాగస్వామ్యాన్ని కల్పించాలి. దానికి సరిపోను క్షేత్రస్థాయి ఉద్యోగులు ఉండాలి. అలా చేయడానికి సరిపోను ఉద్యోగాల్ని సృష్టించాలి. ఎప్పడు ఏ ప్రభుత్వంలో చూసినా క్షేత్రస్థాయిలో చాలా ఖాళీలు ఉంటాయి. బాసుల పోస్టులు ఎప్పుడూ ఖాళీగా ఉండవు మరి. కాబట్టి ఆఫీసులో వ్యవహారాలు అనుమతించడం కొరకు ఈ బాసులు, ఇన్ని అంచెలు అవసరం లేదు. వ్యవహారానికి కాలడ్డం పెట్టే పనికొరకు ఉద్యోగులు, ఉద్యోగాలు ఉండకూడదు. కంప్యూటర్ల వినియోగంతో చాలా రకాల కొత్త ఉద్యోగాలు సృష్టింపబడతాయి. హార్డ్‌వేర్ నిపుణులు, నెట్‌వర్కర్లు, ప్రోగ్రామర్స్, డేటా అడ్మినిస్ట్రేటర్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్స్ లాంటి ఎన్నో రకాల క్రొత్త ఉద్యోగావకాశాలు వస్తాయి.





ప్రభుత్వాలు ఇ-గవర్నమెంటుకి మారడం ఇప్పుడు పూర్తిగా రాజకీయాల దయాదాక్షిణ్యాలమీద ఆధారపడి లేదు. దానికి గ్లోబలైజేషన్, అంతర్జాతీయ సమాజపు వత్తిడి కూడా తోడై ఉన్నది. ప్రపంచ బ్యాంకు మన నేషనల్ ఇ-గనర్నమెంటు యాక్షన్ ప్లాన్‌కి అప్పు అందిస్తామని ముందుకు రావడంలోని భావమదే. ఐ.టి. కంపెనీల వ్యాపార ఒత్తిడి కూడా ప్రభుత్వాల మీద రానురాను పెరుగుతూనే ఉంటుంది

ఈ సమాచార విప్లవం ఆపినా ఆగేది కాదు. మొదలు వ్యాపార సంస్థలన్నీ తమకు తాముగా వ్యవహారాలు నడుపుకోవడం కొరకు ఐటిని ఉపయోగిస్తూ ఉన్నత స్థాయి వ్యవస్థలుగా తయారౌతాయి.ప్రభుత్వాలకు తమ ప్రజలందరినీ, వారి అవసరాల్నీ గుర్తించాలన్న స్ప­­ృహ లేకున్నా వ్యాపారస్తునికి తన ఖాతాదారులందరినీ గుర్తించాల్సిన అవసరం ఉంది. అవి తమ ఖాతాదారుల్ని అంటే ప్రజల్ని కూడా వారి వ్యవస్థలో భాగస్వాములుగా చేసుకొంటాయి. ప్రజలు ఆ వ్యవస్థలకు, వ్యవహార పద్దతులకు అలవాటు పడతారు. రాజకీయ ప్రమేయం అవసరం లేకుండా ఒక నిర్ధిష్టమైన గాడిలో నడిచేట్లుగా వ్యవస్థ పరిణమిస్తుంది. దీంట్లో వ్యాపార ప్రయోజనం, లాభం, స్వార్ధం ఉన్నాయని ఎవ్వరం ఎంత మొత్తుకున్నా ఆగేది కాదు.





నేడు మనకు అందరానిదిగా కనపడుతున్న టెక్నాలజీ అతి త్వరలోనే చేరువ కావడం ఈ కాలంలో మనకు తరచుగా జరిగే అనుభవం. సెల్‌ఫోన్ల విస్తరణ దానికి తాజా ఉదాహరణ. కమ్యూనికేషన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలు కూడా మారుమూల ప్రాంతాలకి చేరేరోజు దగ్గరలోనే ఉంది. కాబట్టి ప్రారంభంలో ప్రణాళికాబద్దంగా వ్యవహరిస్తే మంచి ఫలితాలు కలుగుతాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మొదలు పారిశ్రామిక- వ్యాపార రంగాన్ని, బ్యాంకుల్ని, దేశ ఆర్ధిక రంగాన్ని ఒక్కొక్కదాన్ని చక్కబరుస్తూ ముందుకు సాగుతున్నది. అదే క్రమంలో ప్రజా పరిపాలనని కూడా చక్కబరిచే కార్యక్రమం మొదలౌతుంది. అలా చేయాల్సి అవసరం కూడా చాలా ఉంది. ఐక్యరాజ్యసమితి కూడా ప్రజలకు మంచి పరిపాలనని అందించే మార్గంగా ఇ-గవర్నెన్స్‌ని గుర్తించి వివిధ దేశాల ప్రభుత్వాలని ఆ దిశగా వత్తిడి చేస్తున్నది. వీటన్నిటి నేపధ్యంలో అందరూ ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్ టెక్నాలజీని ఉపయోగించాల్సిన అవసరాన్ని, సందర్భాన్ని, విలువని గుర్తించాలి.ప్రగతిశీలురైన వ్యక్తులు, మేధావులు, సాంకేతిక నిపుణులు, నాయకులు, రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు ఈ విషయమై ఇంకా లోతుగా చర్చించి దీన్ని ఒక ప్రాధమ్య అంశంగా గుర్తించాలి. ప్రభుత్వాల్ని ఆ దిశగా డిమాండ్ చేయాలి. ప్రభుత్వాల ఇ-గవర్నమెంటు పథకాల అమలుని అర్ధం చేసుకొంటూ, ఒక కంట కనిపెడుతూ అందరం స్వాగతించాలి.






ఈ వ్యాసం పూర్తి రూపంలో (120 పేజీలు) ప్రజాపాలనలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనే పుస్తకరూపంలో ఉంది. ఎమెస్కో బుక్స్ వారు ప్రచురించారు. తేదీ 07-05-2008 నాడు ఆంధ్రప్రదేశ్ శాసన సభ స్పీకర్ గౌరవనీయులు శ్రీ కె. ఆర్. సురేశ్ రెడ్డి గారు హైదరాబాద్ రవీంద్రభారతిలో పుస్తకాన్ని ఆవిష్కరించారు.









5 comments:

  1. appreciable effort
    output of technology,art&vision of humanity
    with best wishes

    brahmambabu Kannekanti

    ReplyDelete
  2. I think it is too lengthy. It should be short and lucid.

    ReplyDelete
  3. విశ్లేషణ చాలా బాగుంది . పుస్తక రచయుత మీరేనా .. ?? మీరే అయితే
    మీరు రాసిన పుస్తకాల వివరము , చిన్న కవర్ పేజీ ఇమేజీ , పేజీలు , చిన్న ఉపోద్గాతం , రచయుత , పబ్లిషర్ వివరాలు , లభించు చిరునామా , దర తదితర వివరాలతొ
    ఈ మైల్ చెయ్యండి . bandarushiva@gmail.com

    తెలుగు రత్నలో బుక్స్ లో పెడదాము .

    ReplyDelete
  4. Dear Sitharam Reddy Garu,

    Chaala baga rasaru. Kaani Konchem length ekkuva ayyindi.

    with best wishes
    Subba

    ReplyDelete
  5. చాలా టైముపట్టింది చదవటానికి. మంచి విషయాలు తెలుసుకొన్నందుకు, చేయాల్సిన పనులు ఇన్ని ఉన్నాయా అని ఆశ్చర్యపడ్డాను.
    an excellent analysis with solutions.

    congrats

    ReplyDelete