Sunday, February 7, 2016

మోట

మోట

తాతల కాలంలో అంటే సుమారు 1980 దాకా వ్యవసాయ బావుల్లో నుండి నీళ్ళు తోడే సాధనం మోట. నాకు బాగా  జ్ఞాపకముంది. పెద్దవాళ్ళు మోట తోలుతుంటే కాలువలో నీళ్ళలో ఆడుకోవడం. సరదాకి రెండు బొక్కెన్లు తోలడం. మోట  ఎడ్లకి, ముందుకి వెనక్కి నడవడం అనేది స్పెషల్ ట్రైనింగ్ కిందే లెక్క.  మోట తోలుకుంటూ బోర్ కొట్టకుండా పద్యాలు, యక్ష గానాలు కూడా పాడేవారు. జీతగాళ్ళు చుట్టత్రాగడం సరే సరి. మోటని బావికి అమర్చాలంటే ఆ వైపు దరిని రాతికట్టుతో పక్కాగా కట్టాలి. కొన్ని ఉళ్ళలో బావి నలువైపులా దరులు రాతితో కట్టినవి ఉండేవి. దేవరకొండ దగ్గర నేరేడుగొమ్మ గ్రామంలో ( హోమ్ మంత్రి నాయిని నర్సింహారెడ్డి గారి వూరు) ఆరు మోటల బావి అనే పేరు గల ఒక బావి ఉండేది. ఆరు మోటలట చూడండి. మోట బావి ఉన్న భాగ్యవంతులే వరి అన్నం తినగలిగేవారు. లేకుంటే జొన్న సంకటే.   

మోట మోకు తాల్చడం ఓ బృహత్కార్యం. మర్రిచెట్టు కొమ్మకి మొదలు కట్టి కింద అయిదుగురు అయిదు తాళ్ళని పట్టుకొని పురి పెడుతూ రిధమిక్ గా గుంజి ఒకరి తాడును పక్కనున్న ఇంకొకరికి మార్చుకొంటూ పేనుతారు. పిడికిలి లావు తాడు. పాత మోట బొక్కెనలు ఇంకా కొందరి ఇళ్ళలో కనిపిస్తాయి. మోట అనేది తెలంగాణలో వ్యావసాయక జీవనవిధానంలో ఓ ముఖ్యమైన అంశంగా ఉండేది.

ఇదంతా ఓ డాక్యుమెంటరీగా తీయాలనేది నా చిరకాల సంకల్పం. అదృష్టవశాత్తు ఇంటర్ నెట్ లో ఈ వీడియో దొరికింది. అయినా దీంట్లో నాస్మృతులన్నీ లేవు. వీలైతే లేదా స్పాన్సరర్లు, అభిరుచిగల వాళ్ళ తోడు దొరికితే పూర్తి వివరాలతో కళాత్మకంగా ఈ పురాస్మృతిని, అంతరించిన పోయిన మన జీవన విధానాన్ని డాక్యుమెంట్ చేయాలనే కోరిక ఇంకా ఉంది.