Tuesday, January 12, 2016

భగవద్గీత

 ఘంటసాల గారు గానం చేసిన భగవద్గీత రికార్డు వింటూంటే ఆ గానానికి, బ్యాక్ గ్రౌండ్ కంపోజిషన్ కి  మనస్సు గొప్ప ఆధ్యాత్మిక భావానికి లోనౌతుంది. ఆ రికార్డు తెలుగు వారందరికి ఒక కానుక. దానిని ఉదయాలలో, గుళ్ళలో  వినడం అలవాటు. మనసుకు ఒక రిలీఫ్, ఫ్రెష్ నెస్ కలుగుతుంది. వినీ వినీ అలవాటై ఏ సమయంలో విన్నా ఆ సుప్రభాత అనుభూతి పునరావృతమౌతుంది. 

అంత గొప్ప రికార్డుని ఇటీవలి కాలంలో తరచుగా ఎవరైనా చనిపోయినప్పుడు, అంతిమ యాత్రలలో వినిపిస్తున్నారు. అలా వినడం అలవాటైన జనాలకి  భగవద్గీత రికార్డు పెట్టగానే అంతిమ యాత్రలే గుర్తుకు వచ్చి, చివరకు దానిని అపశకున చిహ్నంగా భావించే దశకు చేరుతున్నారు. మన టి.వి. చానెళ్ళ వాళ్ళు కూడా ఎవరైనా చనిపోయినప్పుడు రోజంతా భగవద్గీతనే వినిపించడం దీనికి పరాకాష్ట.

ఒకరోజు ఉదయాన నేను భగవద్గీత రికార్డు పెట్టినప్పుడు నాకు సుప్రభాత - ఆధ్యాత్మిక అనుభూతి కలిగితే నా మిత్రుడికేమో అంతిమ యాత్రలే గుర్తుకు వస్తున్నాయని చెప్పాడు. ఎక్స్పోజర్, అసోసియివిటీ లలో ఉన్న మాయే అది.

నిజానికి భగవద్గీత అర్జునుణ్ణి కర్తవ్యోణ్ముకుణ్ణి  చేయడానికి బోధించబడినది.  ఆ వరుసలో జాతస్యహి మరణం ధృవం అనే శ్లోకం దానిలో ఉండడం వల్లనేమో ఈ రికార్డుని మరణ సందర్భాలలో వాడుతున్నారు.

జనన మరణాలు అనివార్యము, సహజమే అయినా, ఒక మంచి, గొప్ప, మనదైన సాంస్కృతిక సంపదని దాని ఉద్దేశిత లక్ష్యానికి కాకుండా దూరంగా తీసుకెళుతున్నామేమో అనిపిస్తుంది. దీని విషయమై ఆలోచిద్దాం.